JAISW News Telugu

CM Revanth : మోదీ మా పెద్దన్న.. రేవంత్ కామెంట్స్ వీడియో వైరల్..

CM Revanth

CM Revanth

CM Revanth : కాంగ్రెస్, బీజేపీ మధ్యలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందని మనకు తెలిసిందే. కాంగ్రెస్ పార్టీని దేశంలో లేకుండా చేయాలని బీజేపీ కంకణం కట్టుకుంది. అలాగే బీజేపీ స్వాతంత్ర్య పోరాటంలో లేదని, ఆ పార్టీ మత రాజకీయాలు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ నిత్యం విమర్శిస్తుంటుంది. దేశంలోనే ప్రధాన పార్టీలు ఇవే..అలాగే అత్యంత శత్రుత్వ పార్టీలు ఇవే.. కానీ కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిత్యం దేశ ప్రధాని నరేంద్ర మోదీని పొగుడుతూ వార్తల్లో నిలుస్తున్నారు.

వాస్తవానికి రేవంత్ వైఖరి ఆలోచింపచేసేదిగానే ఉంది. రాజకీయాలు ఎన్నికల వరకేనని, పాలనలో రాజకీయం చూపించవద్దు అని ఆయన భావిస్తున్నట్లు అర్థమవుతుంది. రేవంత్ సీఎం అయిన కొన్ని రోజుల్లోనే మంత్రులతో కలిసి కేంద్ర పెద్దలు మోదీ, అమిత్ షాలను కలిసి తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. తాజాగా ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఆదిలాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో వేదిక పంచుకున్న రేవంత్ రెడ్డి తర్వాత ప్రసంగించారు.

ఎన్నికల సమయంలోనే తాము రాజకీయాలు చేస్తామని, మిగిలిన సమయమంతా రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణాత్మక వైఖరి ఉంటే అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని చెప్పారు. ఒక పెద్దన్న మాదిరి ప్రధాని మోదీ రాష్ట్రానికి అన్ని విధాలా సహకరించాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సుహృద్భావ వాతావరణం ఉండాలని చెప్పారు. మూసీ నది ప్రక్షాళన, అభివృద్ధికి సహకరించాలని కోరారు. మెట్రో రైలు విస్తరణ, విద్యుత్ సమస్యల పరిష్కారానికి సహకరించాలన్నారు. హైదరాబాద్ కంటోన్మెంట్ లో 175 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించినందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు.

Exit mobile version