CPI Narayana : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను చూసి పీఎం మోదీ భయపడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఈరోజు ఆయన హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడుతూ శిఖండి మాదిరిగా మహిళను ఉపయోగించి కేజ్రీని బద్నాం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. తనను వ్యతిరేకించే వారిపై మోదీ కక్షపూరితంగా, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. నడమంత్రపు స్వర్గాన్ని సృష్టించి తనకు 400 సీట్లు వస్తాయని అంటున్నారని మండిపడ్డారు.
మోదీ రాజ్యాంగంపై బుల్ డోజర్లతో దాడి చేస్తారని నారాయణ చెప్పారు. దేవాలయాలపై కాంగ్రెస్ పార్టీ దాడులు చేస్తోందని మోదీ అంటున్నారని, దీనిపై ఈసీ మెతక వైఖరి ప్రదర్శిస్తోందని అన్నారు. దేశమంతా ఎన్నికల ప్రచారం చేసి చివరలో తన నియోజకవర్గంలో ప్రచారం చేసుకునేలా ఎన్నికల తేదీలు ఖరారయ్యాయని ఆరోపించారు. సౌత్ లో బీజేపీ ఎక్కడ ఉందని, ఎక్కడి నుంచి సీట్లు వస్తాయని ఆయన ప్రశ్నించారు.
ఈ ప్రభుత్వ హయాంలో హోల్ సేల్ అవినీతి జరిగిందని ఆరోపించారు. మోదీ గ్యారంటీ అంటే ఆర్ఎస్ఎస్ కూడా తిరగబడిందని అన్నారు. ఏపీలో సీఎంను నిర్ణయించేది మోదీయేనని నారాయణ పేర్కొన్నారు. ఏపీలో హింస జరుగుతుంటే సీఎం, ప్రతిపక్ష నాయకుడు విదేశాల తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.