Modi government : మీడియాకు రక్షణ కార్యకలాపాల కవరేజ్‌పై మోడీ సర్కార్ కీలక సూచనలు
Modi government : జాతీయ భద్రత దృష్ట్యా, రక్షణ కార్యకలాపాల కవరేజ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం మీడియాకు కీలక సూచనలు జారీ చేసింది. అన్ని మీడియా ప్లాట్‌ఫామ్‌లు, వార్తా సంస్థలు మరియు సోషల్ మీడియా వినియోగదారులు రక్షణ కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారం చేయకూడదని, అలాగే మూలాధార సమాచారం ఆధారంగా వార్తలు ప్రచురించరాదని మోదీ ప్రభుత్వం స్పష్టం చేసింది.
సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఒక అడ్వైజరీని విడుదల చేసింది. దేశ భద్రతకు సంబంధించిన విషయాలలో అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మీడియాను కోరింది. రక్షణ కార్యకలాపాలు లేదా భద్రతా బలగాల కదలికలకు సంబంధించిన నిజ-సమయ కవరేజ్, దృశ్యాలను పంచుకోవడం లేదా మూలాల ఆధారంగా సమాచారాన్ని నివేదించడం వంటివి చేయకూడదని పేర్కొంది. సున్నితమైన సమాచారాన్ని ముందుస్తుగా బహిర్గతం చేయడం శత్రువులకు అనుకోకుండా సహాయం చేయవచ్చని.. కార్యకలాపాల ప్రభావానికి, సిబ్బంది భద్రతకు ముప్పు వాటిల్లవచ్చని అడ్వైజరీ హెచ్చరించింది.
గతంలో కార్గిల్ యుద్ధం, 26/11 ముంబై దాడులు వంటి సంఘటనల సమయంలో అనియంత్రిత కవరేజ్ జాతీయ ప్రయోజనాలకు ప్రతికూల పరిణామాలను కలిగించిందని అడ్వైజరీ గుర్తు చేసింది. జాతీయ భద్రతను కాపాడటంలో మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు, వ్యక్తులు కీలక పాత్ర పోషిస్తారని ప్రభుత్వం పేర్కొంది. చట్టపరమైన బాధ్యతలతో పాటు, కొనసాగుతున్న ఆపరేషన్లను లేదా మన బలగాల భద్రతను దెబ్బతీయకుండా చూసుకోవడం మనందరి నైతిక బాధ్యత అని తెలిపింది.
కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ (సవరణ) నియమాలు, 2021లోని రూల్ 6(1)(p) ప్రకారం, భద్రతా బలగాలు నిర్వహించే ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ల ప్రత్యక్ష ప్రసారాన్ని ఇప్పటికే నిషేధించడం జరిగిందని అడ్వైజరీలో పేర్కొన్నారు. అటువంటి ఆపరేషన్లు ముగిసే వరకు, ప్రభుత్వం నియమించిన అధికారి ఇచ్చే నిర్దిష్ట సమయ వ్యవధిలో మాత్రమే మీడియా కవరేజ్ పరిమితం చేయబడాలని ఈ నియమం చెబుతోంది. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ అడ్వైజరీ ద్వారా దేశ భద్రతకు సంబంధించిన విషయాలలో మీడియా మరింత సంయమనం పాటించాలని.. బాధ్యతాయుతమైన రిపోర్టింగ్‌కు కట్టుబడి ఉండాలని కేంద్ర ప్రభుత్వం బలంగా సూచించింది.