PM Modi:మోదీ షెడ్యూల్‌కు ముందే ఎన్నికలకు రెడీ అవుతున్నాడా?
PM Modi:పీఎం మోదీ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా? అంటే జరుగుతున్న పరిణామాలని బట్టి రాజకీయ విశ్లేషకులు అవుననే సమాధానం చెబుతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ పార్టీ మూడు రాష్ట్రాల్లో విజయం సాధించింది. దీంతో బీజేపీ వర్గాల్లో అంతులేని ఆత్మవిశ్వాసం మొదలైంది. ఇప్పటికిప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగితే ముచ్చటగా మూడవ సారి బీజేపీ అధికారంలోకి రావడం గ్యారంటీ అని పీఎం నరేంద్ర మోదీతో పాటు పార్టీ కీలక నేతలు భావిస్తున్నారట. అందుకే ఏప్రిల్‌లో జరగాల్సిన ఎన్నికలని షెడ్యూల్‌కు నెల ముందే అంటే మార్చిలో జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
వచ్చే ఏడాది మార్చి 7 నుంచి 10 లేదా 10 నుంచి 15 మధ్య మొదటి దశని పూర్తి చేయాలని భావిస్తున్నారట. ఇదిలా ఉంటే ఈ నెల 20న లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం కూడా దాదాపుగా ఇదే తేదీని ఖరారు చేయాలని భావిస్తున్నట్టుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్చి నెలలో తొలి విడత లోక్ సభ ఎన్నికలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ దీనిపై అంతర్గతంగా చర్చ జరుగుతోంది.
ఇటీవల తెలంగాణ బీజేపీ నేత కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. మరో మూడు నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయని, ఈ ఎన్నికల్లో బీజేపీ ఎవరితో పొత్తు పెట్టుకోదని, ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పడం మరింత బలాన్ని చేకూరుస్తోంది. 17వ లోక్ సభ గడువు జూన్ 16, 2024తో ముగియనుంది. ఆ కారణంగానే వచ్చే ఏడాది మే నెలాఖరులోగా సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది
2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎన్నికల షెడ్యూల్ మార్చి 10న విడుదలైంది. ఏడు దశల్లో ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు ఏడు దశల్లో నిర్వహించారు. ఇక తెలుగు రాష్ట్రల ఎన్నికలని తొలి దశలో పూర్తి చేశారు. ఈ సారి కూడా అదే పంథాను అనుసరిస్తే తెలుగు రాష్ట్రాల్లో మార్చి 10 నుంచి 15వ తేదీల మధ్య జరిగే అవకాశం ఉంది. దీన్ని గమనించిన టీడీపీ, వైసీపీ పార్టీ శ్రేణులు ఎన్నికల వ్యూహరచనను ఇప్పటికే ప్రారంభించేశాయి. ఇప్పటికే అధికార వైసీపీ పార్టీ నేతలని, పలు నియోజక వర్గాల్లోని సిట్టింగ్ లీడర్లని మార్చేసే పనిలో పడింది.
ఇప్పటికే 11 జిల్లాల ఇంచార్జ్‌లను మార్చడమే కాకుండా పనితీరు బాగాలేకపోతే సిట్టింగ్ ఎమ్మెల్యేలని మారుస్తామంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ వార్నింగ్ ఇచ్చి ఎన్నికల సమరానికి పావులు కదుపుతూ వడివడిగా అడుగులు వేస్తున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాత్రం పార్టీ శ్రేణులు ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికలకు సిద్ధం కావాలని, 17 లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేయాలని, ఇప్పటికే ఇచ్చిన ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేసి ఓటర్లని ఆకర్షించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్టు సమాచారం.