Bharat Ratna 2024 Awards : కేంద్ర ప్రభుత్వం మరో ముగ్గురికి భారతరత్న ప్రకటించిన విషయం తెలిసిందే. వారిలో తెలుగు బిడ్డ పీవీ నరసింహరావు, చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్ ఉన్నారు. మన తెలుగు బిడ్డ పీవీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం లభించడంతో తెలుగు నేల పులకించిపోయింది. భారతరత్నల ప్రకటనను ప్రధాని మోదీ స్వయంగా ట్విటర్ వేదికగా పోస్ట్ చేశారు.
ఇంతకుముందే బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్, మాజీ ఉప ప్రధాని ఎల్ కే అద్వానీలకు ప్రకటించిన విషయం తెలిసిందే. అద్వానీ మినహా మిగతా అందరికీ మరణానంతరం భారతరత్న ప్రకటించినట్టైంది.
తెలంగాణకు చెందిన పీవీ నరసింహరావుకు అపర చాణక్యుడు, బహుభాషా పండితుడిగా పేరుంది. రాజీవ్ గాంధీ హత్యానంతరం అనూహ్యంగా ప్రధాని పదవిని ఆయన చేపట్టారు. 1991 జూన్ నుంచి 1996 మే వరకూ ప్రధానిగా పూర్తికాలం పనిచేశారు. పీవీ..మైనారిటీలో ఉన్న అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని ఐదు సంవత్సరాల పాటు విజయవంతంగా నడిపిన కీర్తిని దక్కించుకున్నారు.
1971లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయ్యారు. ఉమ్మడి ఏపీకి నాలుగో ముఖ్యమంత్రిగా చరిత్రలో తన పేరును లిఖించుకున్నారు. మంథని ఆయన సొంత అసెంబ్లీ నియోజకవర్గం. ఎంపీగా హనుమకొండ, మహారాష్ట్రలోని రామ్ టెక్ స్థానాల నుంచి రెండు సార్ల చొప్పున లోక్ సభకు ఎన్నికయ్యారు. ప్రధానిగా బాధ్యతలను స్వీకరించిన తరువాత ఉప ఎన్నిక ద్వారా నంద్యాల నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు.
భారత పురస్కారానికి పీవీ పేరు నామినేట్ చేయడంపై భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నిర్ణయాన్ని స్వాగతించినట్లు ఆయన పేర్కొన్నారు.
గతేడాది అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్.. పీవీ నరసింహరావు శతజయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించామని గుర్తు చేశారు. పీవీకి భారతరత్న పురస్కారం ఇవ్వాలంటూ కేసీఆర్ పలుమార్లు కేంద్రాన్ని కోరారని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా ఈ ప్రతిపాదనలు చేశారని వ్యాఖ్యానించారు. ఎట్టకేలకు కేంద్రం తమ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిందని చెప్పారు.