PM Modi : రేపు సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడబోతున్నాయి. రాజకీయ నాయకుల్లోనూ, జనాల్లోనూ తీవ్ర ఉత్కంఠ, అత్యంత ఆసక్తి కనపడుతోంది. ఇక మొన్నటి ఎగ్జిట్ పోల్స్ అన్నీ గంపగుత్తగా ఎన్డీఏ కూటమి గెలవబోతుందని ప్రకటించేశాయి. అంటే మోడీ మూడోసారి ప్రధాని కావడం పక్కా అన్నమాట. 543 సీట్లు కలిగిన లోక్ సభలో కేంద్ర ప్రభుత్వ ఏర్పాటుకు 272 సీట్లు అవసరం ఉండగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి 353-383 సీట్లు గెలుచుకోబోతోందని ఏబీపీ- సీ ఓటర్ చెప్పింది. మిగిలిన ఏజెన్సీల గణాంకాలు కూడా కాస్త అటూ ఇటూగా ఉన్నా మొత్తానికైతే ఎన్డీఏ కూటమి విజయం మాత్రం పక్కా అని చెప్పాయి.
అయితే మోడీ మళ్లీ పగ్గాలు చేపడితే దేశానికి బలమైన నాయకత్వం, స్థిరమైన విధానాలు ఉన్న ప్రభుత్వం ఏర్పడుతుంది. భారత్ గురించి ప్రపంచ దేశాలకు ఓ చక్కటి సందేశం పంపించినట్లు అవుతుంది. కనుక రాబోయే రోజుల్లో భారత్ కు మరిన్ని భారీ పెట్టుబడులు, పరిశ్రమలు తరలివస్తాయి. మోదీ ప్రభుత్వం దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు చాలా ప్రాధాన్యం ఇస్తోంది కనుక భారత్ మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది.
ఇంత వరకు బాగానే ఉన్నా దేశంలోని బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాల మనుగడ చాలా కష్టంగా మారుతుంది. తెలంగాణ, కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఢిల్లీలో కేజ్రీవాల్, బెంగాల్ లో మమత, ఒడిశాలో నవీన్ పట్నాయక్ ప్రభుత్వాలను కూల్చేసి బీజేపీ అధికారం దక్కించుకోవచ్చు అనే భయాలు వ్యక్తమవుతున్నాయి. మోడీ ప్రభుత్వం ఇప్పటికే మతం ఆధారంగా ప్రజల మధ్య చిచ్చు పెడుతోందని సెక్యులర్ వాదులు గగ్గోలు పెడుతుంటారు. అలాగే నియంతృత్వం పెరిగే అవకాశం ఉంది. అందుకే కేంద్రంలో మోడీ సర్కార్ మళ్లీ వస్తే కొందరికి మోదం..మరికొందరికి ఖేదం తప్పకపోవచ్చు.