Modi-Chandrababu-Pawan : ఒకే వేదికపై మోదీ, చంద్రబాబు, పవన్..ఎప్పుడంటే..!
Modi-Chandrababu-Pawan : లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో బీజేపీ దూకుడు పెంచింది. దేశ వ్యాప్తంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాలపై దృష్టి సారించింది. ఈ ఎన్నికల్లో భారీ విజయం సాధించాలని ఆకాంక్షిస్తోంది. 400 సీట్లకు పైబడి గెలిచేలా కార్యాచరణ రూపొందిస్తోంది. ఈ విజయం కోసం అవసరమైన వ్యూహాలను దేశ రాజధానిలోని భారత్ మండప్ వేదికగా నిర్వహించిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చర్చించింది. ఈ సమావేశంలో నరేంద్ర మోదీని తమ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. స్టార్ క్యాంపెయినర్లనూ ఎంపిక చేసింది.
దేశ వ్యాప్తంగా మోదీ పాల్గొనవల్సిన బహిరంగ సభలు, రోడ్ షోలకు సంబంధించిన రూట్ మ్యాప్ పై కసరత్తు పూర్తి చేసింది. దీని ప్రకారం ఈశాన్యంతో పాటు దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ మోదీ బహిరంగ సభలను నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఇందులో భాగంగా మార్చి మొదటి వారంలో మోదీ దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించబోతున్నారు.
ఈక్రమంలో మార్చి 2న ఏపీ, తెలంగాణల్లో ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారైనట్టు తెలుస్తోంది. ఒకే రోజున ఈ రెండు రాష్ట్రాల్లో జరిగే బహిరంగ సభల్లో మోదీ పాల్గొంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా బీజేపీ ఈ నిర్ణయం తీసుకుందని, ఏర్పాట్లు చేయాల్సిందిగా రెండు తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు పురందేశ్వరి, జి.కిషన్ రెడ్డిలకు సమాచారం ఇచ్చిందని సమాచారం.
ఇక ఏపీలో టీడీపీ, జనసేన కూటమితో కలిసి బీజేపీ ఎన్నికలు వెళ్లడానికి రెడీ అయ్యిందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో.. మోదీ తెలుగు రాష్ట్రాల్లో పర్యటించబోతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. అదే జరిగితే మోదీతో కలిసి చంద్రబాబు, పవన్ వేదికను పంచుకోవడం ఖాయం.
బీజేపీతో పొత్తుపై ఈనెల 21న చంద్రబాబు ప్రకటన చేసే అవకాశం ఉంది. పొత్తులో భాగంగా బీజేపీ-జనసేనలకు కలిపి 30 అసెంబ్లీ, 10 లోక్ సభ స్థానాలను కేటాయించాలని చంద్రబాబు నిర్ణయించినట్టు తెలుస్తోంది. మరి దీనికి బీజేపీ, జనసేన ఒప్పుకుంటాయా లేదా..అనేది త్వరలోనే తెలుస్తుంది. కొన్ని సీట్లు అటు ఇటుగానైనా పొత్తు కుదరడం మాత్రం ఖాయం. ఇదే జరిగితే వైసీపీకి రాబోయే ఎన్నికల్లో గట్టి దెబ్బే అని చెప్పవచ్చు.