High Court : ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదు: హైకోర్టు
High Court : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నికపై హైకోర్టు తీర్పు వెల్లడించింది. ఎమ్మెల్సీగా ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించింది. కాంగ్రెస్ నేత పాతిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపి విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. ఆయనకు రూ. 50 వేల జరిమానా కూడా విధించింది.
ఫోర్జరీ సంతకాలతో తన పేరిట నామినేషన్ ఉపసంహరణ పత్రాలు ఇచ్చారని రాజేశ్వర్ రెడ్డి పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఈ తీర్పు వెలువరించింది. కోర్టు తీర్పుతో ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా విఠల్ తర్వాత స్థానంలో నిలిచిన వ్యక్తికి ఎమ్మెల్సీ పదవి దక్కే అవకాశం ఉంది. కాగా ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి పోటీ చేసి 6767 ఓట్ల మెజారిటీతో గెలిచి 2021 డిసెంబరు 14న ఎమ్మెల్సీగా విఠల్ ఎన్నికయ్యారు. 2022 ఫిబ్రవరి 21న శాసన మండలి సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు.