MLC Candidates : ఆ ఇద్దరికే మళ్లీ ఎమ్మెల్సీ చాన్స్..? కోర్టు కొట్టేసినా..
MLC Candidates : గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంలో హైకోర్టు కీలక తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో కోదండరామ్ ను రేవంత్ కావాలనే బకరా చేశాడని సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు దర్శనమిస్తున్నాయి. అయితే ఈ తీర్పు ఇలా వస్తుందని రేవంత్ కు, ప్రభుత్వ ముఖ్యులకు ముందే తెలుసు. కోదండరామ్ తో పాటు, జర్నలిస్ట్ అమిర్ అలీఖాన్ లను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించాలనే నిర్ణయం తీసుకుని గవర్నర్ కు పంపించింది రేవంత్ సర్కార్. ఆమె వెంటనే ఆమోద ముద్ర వేశారు.
కానీ హైకోర్టు తీర్పు వచ్చింది ఇప్పుడే.. స్థూలంగా చూస్తే హైకోర్టు తీర్పు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించిన దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణలకు అనుకూలంగా వచ్చినట్టే.. కానీ వాళ్లకు అల్టిమేట్ గా దక్కేదేమీ ఉండదు. ఎందుకంటే.. వాళ్ల అర్హతలకు సంబంధించిన వివరాలు కావాలంటే తెప్పించుకుని, వారి నియామకాన్ని పున:పరిశీలించాలని హైకోర్టు చెప్పింది. అది జరగాలి కాబట్టి కోదండరామ్, అమిర్ అలీఖాన్ ల నియామకం జీవోను కొట్టేసింది. కానీ హైకోర్టు గవర్నర్ విచక్షణాధికార పరిధిలోకి ఎంటర్ కాలేదు. కాబట్టి ఇప్పుడు జరిగేది ఏంటంటే..
గవర్నర్ కేబినెట్ నుంచి వివరాలు అడుగుతుంది..ఆ పాత కేబినెట్ ఎలాగూ మారిపోయింది కాబట్టి..కోదండరామ్, అమిర్ అలీఖాన్ నియామకాన్ని ఈ ప్రభుత్వమే నియమించింది కాబట్టి వాళ్ల వివరాలు గవర్నర్ కు పంపిస్తుంది. పాత కేబినెట్ ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది అనుకోండి. కానీ ఈ ప్రభుత్వం గవర్నర్ తో సఖ్యతతోనే ఉంటుంది కాబట్టి ఈ ఇద్దరికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఖాయమే. ఇది ఓకే అయితే కోదండరామ్ కు మంత్రివర్గంలో కూడా చోటు దక్కే అవకాశాలు పుష్కలంగా కనపడుతున్నాయి.