Jammu and Kashmir : జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో ఎమ్మెల్యేల బాహాబాహీ
Jammu and Kashmir : జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో గురువారం యుద్ధ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యేలు పరస్పరం దాడులు చేసుకున్నారు. నేడు (గురువారం) కార్యక్రమాలు మొదలు కాగానే ఇంజినీర్ రషీద్ సోదరుడు, ఎమ్మెల్యే ఖుర్షీద్ అహ్మద్ షేక్ ఆర్టికల్ 370 పునరుద్ధరించాలనే బ్యానర్ ను ప్రదర్శించగా, దీనిపై ప్రతిపక్ష బీజేపీ నేత సునీల్ శర్మ అభ్యంతరం తెలిపారు. దీంతో తీవ్ర గందరగోళం మొదలైంది. ఎమ్మెల్యేలు ఒకరిపై మరొకరు దూసుకుపోయి పిడిగుద్దులతో దాడులు చేసుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన అసెంబ్లీ మార్షల్స్ దాడులకు దిగిన ఎమ్మెల్యేలను విడదీశారు. కొందరు బీజేపీ ఎమ్మెల్యేలను బయటకు పంపారు. ఈ ఘటనపై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్ కొద్దిసేపు సభను వాయిదా వేశారు.
2019లో కేంద్రం తొలగించిన ఆర్టికల్ 370, 32ఏ ను పునరుద్ధరించాలని కోరుతూ పీడీపీ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది. ప్రత్యేక రాష్ట్ర హోదాను కూడా ఇవ్వాలని కోరింది. బుధవారం కూడా జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని పునరుద్ధరించాలంటూ శాసనసభ తీర్మానం చేసింది. దీనిని కూడా బీజేపీ సభ్యులు వ్యతిరేకిస్తూ తీర్మానం కాపీలను చింపేశారు.