YCP : టీడీపీలోకి ఎమ్మెల్యే..జనసేనలోకి ఎంపీ.. వైసీపీకి ‘కృష్ణా’ తలనొప్పి
YCP : ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. మరో రెండు, మూడు నెలల్లో ఎన్నికలు ఉండడంతో పార్టీల అధినేతలు అభ్యర్థుల ఎంపికల పనిలో పడ్డారు. ఇక వైసీపీ ముందుగానే ఈ పనిని ప్రారంభించింది. అయితే మొదట్లో మార్పులు, చేర్పులు విషయం పెద్దగా ఆ పార్టీపై ప్రభావం చూపలేదు. కానీ తాజాగా చాలా మందే ఆ పార్టీ అధిష్ఠానం వైఖరిపై అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. అందుకే వారంతా ఇతర పార్టీల్లోకి జంప్ కావడానికి ప్రయత్నిస్తున్నారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో మార్పులు, చేర్పుల ప్రక్రియ దాదాపు కొలిక్కి వచ్చింది. ఒక ఎంపీ, మరో సీనియర్ ఎమ్మెల్యే వ్యవహారం మాత్రం సమస్యగా మారుతోంది. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి పార్టీలో కొనసాగుతారా? లేదా అనే చర్చ మొదలైంది. సీనియర్ ఎమ్మెల్యే పార్థసారధిని ఎంత బుజ్జగించినా ఆయన టీడీపీలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్టు ఖాయమే అని తెలుస్తోంది.
అయితే ఈ జిల్లా వైసీపీ అభ్యర్థుల ఎంపిక తుది దశకు చేరుకున్నా.. పెనమలూరు సీటుపై మాత్రం ఇంకా స్పష్టత రావడం లేదు. జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎంవోలో మంతనాలు జరిపినా ఈ విషయంలో మాత్రం కొలిక్కిరావడం లేదు. పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారధిని మచిలీపట్నం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని అధిష్ఠానం ఆదేశించింది. ఆయన దానికి ఇష్టపడడం లేదు. మంత్రిగా తనకు అవకాశం ఇవ్వలేదన్న అసంతృప్తితో పాటు ఈసారి వైసీసీ అధికారంలోకి రావడం కష్టమేనన్న ఆలోచనలో ఉన్న పార్థసారధి టీడీపీలోకి వెళ్లేందుకు ఫిక్స్ అయ్యారు.
ఈనెల 18న గుడివాడలో జరిగే చంద్రబాబు సభలో పార్థసారధి టీడీపీలో చేరుతారని తెలుస్తోంది. జగన్ తనను గుర్తించకపోయినా పెనమలూరు ప్రజలు మాత్రం తనను గుండెలో పెట్టుకుని చూసుకుంటారని ఆయన పేర్కొంటున్నారు. పార్టీ పెద్దల తీరుతో ఆయన పార్టీ మారడం దాదాపు ఖాయమే.
ఇక వల్లభనేని బాలశౌరి కూడా పార్టీ మారుతారనే ప్రచారం తీవ్రంగానే జరుగుతోంది. ఇప్పటికే సినీ డైరెక్టర్ వీవీ వినాయక్ ను రంగంలోకి దించడానికి అధిష్ఠానం ప్రయత్నించినట్టు తెలసింది. టీడీపీ, జనసేన, బీజేపీ కలిస్తే.. సామాజిక కార్డుతో బాలశౌరి జనసేనలో కలుస్తారని మచిలీపట్నం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే తాము వైసీపీకి దూరం కానున్నట్టు బాలశౌరి అనుచర వర్గం ప్రచారం జరుగుతోంది.
మచిలీపట్నం ఎంపీ బాలశౌరి అభ్యర్థిత్వాన్ని నియోజకవర్గ పరిధిలో మెజార్టీ ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారు. ఆయన స్థానంలో మరొకరికి అవకాశం ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరుతున్నారు. దీంతో ఎవరూ ఎన్ని రాజకీయాలు చేసినా తాను మాత్రం మచిలీపట్నం నుంచే పోటీ చేస్తానని ఆయన తేల్చిచెబుతున్నారు. అయితే పార్థసారధిని ఎంపీగా పోటీ చేయాలనే పార్టీ ప్రతిపాదనతో ఇప్పుడు బాలశౌరికి స్థానం లేదనే చర్చ నడుస్తోంది. అయితే ముఖ్యమంత్రికి సన్నిహితుడిగా బాలశౌరికి పేరుంది. ప్రస్తుతం వైసీపీ అధినేత మూడో లిస్ట్ ప్రకటించడానికి సిద్ధమయ్యారు. మరి పార్థసారధి, బాలశౌరిల విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.