Jagan Strategy : నేటి రాజకీయాల్లో సామాన్యులు మనుగడ సాగించే పరిస్థితి లేదు. అంగ, అర్ధ బలమున్న వారికే అది సాధ్యం. ఇక ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు రావాలంటే కోట్లు కుమ్మరించాల్సిందే. తినడానికే సరైన తిండి లేని వారు ఇక ఎన్నికల్లో సీటు దక్కించుకోవడమనేది కల మాత్రమే. సర్పంచ్ గా పోటీ చేయాలంటేనే లక్షలు ఖర్చు చేయాల్సిన రోజులివి. అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో పోటీ అంటే అది జరగని పని. కానీ అలాంటి దాన్నే జగన్ చేసి చూపించారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సామాన్య కార్యకర్తకు టికెట్ ఇచ్చి జగన్ పెద్ద సాహసమే చేస్తున్నారు. దాదాపు 14 మంది సామాన్యులను తమ పార్టీ అభ్యర్థులుగా జగన్ ప్రకటించారు. ఇందులో ఎంపీపీలు, జడ్పీలు, సర్పంచ్ లు సైతం ఉన్నారు. వీరితో పాటు శింగనమల నియోజకవర్గంలో ఓ సాధారణ డ్రైవర్ ను అభ్యర్థిగా ప్రకటించి జగన్ సంచలనం సృష్టించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో శింగనమల అభ్యర్థిగా టిప్పర్ డ్రైవర్ గా పనిచేస్తున్న వీరాంజనేయులును అధికార పార్టీ బరిలోకి దించింది.
ఈ నియోజకవర్గంలో జొన్నలగడ్డ పద్మావతి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమెను కాదని వీరాంజనేయులుకు టికెట్ ఇవ్వడంపై పార్టీ నాయకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. నియోజకవర్గంలో ఎంతో మంది పేరున్న నేతలను కాదని వీరాంజనేయులుకు టికెట్ ఎలా దక్కిందో ఎవరికీ అర్థం కావడం లేదు. టిప్పర్ డ్రైవర్ గా పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నారు వీరాంజనేయులు. స్థానికంగా ఆయనకు మంచి పేరే ఉంది.
ఆయన 2014లో ఎంఎడ్ ను పూర్తి చేశారు. ఆ తర్వాత ప్రజలకు సేవ చేయాలనే కోరికతో రాజకీయాల్లోకి వచ్చారు. గతంలో ఆయన తండ్రి సర్పంచ్ గా పనిచేశారు. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వీరాంజనేయులుకు ఎటువంటి ఆస్తులు లేవు. వైసీపీకి వీరవిధేయుడిగా, పార్టీనే నమ్ముకుని పనిచేస్తున్నారు. దీని కారణంగానే ఆయనకు టికెట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరి వచ్చే ఎన్నికల్లో ఆయన గెలిస్తే పెద్ద రికార్డే అనుకోవాలి. జగన్ చేసిన ఈ సాహసం ఫలిస్తుందా? లేదా అనేది ఎన్నికల ఫలితాలు వస్తే తెలుస్తుంది.