MLA Rammohan Reddy : తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తొడగొట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి సీఎం అయినప్పటి నుంచి ‘ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు.. ఏ క్షణమైనా పడిపోతుంది’ అంటూ బీజేపీ, బీఆర్ఎస్ నేతల నుంచి ఛాలెంజ్ లు వస్తూనే ఉన్నాయి. అఖరికి అసెంబ్లీ సమావేశాలకు ముందు కూడా ఇవే మాటలు వచ్చాయి. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి చిర్రెత్తుకొచ్చింది.
ప్రతిసారి ఈ పడగొట్టుడు ఏంది అంటూ అసెంబ్లీలోనే ఆగ్రహంతో ఊగిపోయారు. ‘‘ఎవరైనా సరే ప్రభుత్వాన్ని పడగొడతాం అంటే ఊరుకునే ప్రసక్తేలేదు. ప్రభుత్వానికి సహకారం ఇవ్వండి అంతే తప్ప.. ఊరికే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతాం.. పడగొడతాం అంటే మేం తొడగొడతాం’’ అని రామ్మోహన్ రెడ్డి గట్టగానే మాట్లాడారు. అంతేకాకుండా మాటలే కాదు చేతల్లోనే తొడగొట్టి మరీ చూపించారు పరిగి ఎమ్మెల్యే.
దీంతో ఒక్కసారిగా అసెంబ్లీ మొత్తం సైలెంట్ అయిపోయింది. రెండు నిమిషాల తర్వాత తేరుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బల్లలు చరిచారు. అయితే ఇలా చేయడం అనేది ప్రతిపక్షాలకు మెసేజ్ అని.. రెండోసారి ఇలా అనకుండా ఉండడానికే అని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అయితే, ప్రజా సమస్యలపై గళం వినిపించి పరిష్కరించాల్సిన అసెంబ్లీలో తొడగొట్టడమేంటని ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల నుంచి విమర్శలు వస్తున్నాయి.