Narasapuram MPDO : అదృశ్యమైన నర్సాపురం ఎంపీడీవో వెంకటరమణ ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఫెర్రీ నిర్వహణ బకాయిల వ్యవహారంలో ఎంపీడీవో స్థాయి అధికారి ఆత్మహత్య చేసుకుంటానంటూ అదృశ్యం కావడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించడంతో మాజీ ఎమ్మెల్యేతో పాటు ఫెర్రీ నిర్వాహకుడు ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీవో వెంకటరమణ జూలై 15 నుంచి కనిపించకుండా పోయారు. ఎంపీడీవో చివరిసారిగా మచిలీపట్నం రైల్వేస్టేషన్ నుంచి నేరుగా మధురానగర్ స్టేషన్ లో దిగినట్లు పోలీసులు గుర్తించారు. రైల్వే స్టేషన్ నుంచి కాల్వకట్ట వరకు సుమారు 2 కి.మీ. ఆయన నడుచుకుంటూ వెళ్లినట్లు తెలిపారు. అర్ధరాత్రి సమయంలో కాలువలోకి దూకి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఎంపీడీవో ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఒక వ్యక్తి నీళ్లలో దూకినట్లుగా పెద్ద శబ్దం వచ్చిందని స్థానికులు చెబుతున్నారు.
పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కేసరపల్లి నుంచి విజయవాడ వైపు గాలిస్తున్నారు. రెండు బూట్లలో 30 మంది సిబ్బంది గాలింపు చర్యల్లో నిమగ్నమయ్యారు.