Pragathi Bhavan : ప్రగతి భవన్ నుంచి కంప్యూటర్ల మాయం.. సీసీ టీవీలో విజువల్స్..వారే చేశారా?
Pragathi Bhavan : తెలంగాణలో బీఆర్ఎస్ ను గద్దె దించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. గత ప్రభుత్వం ఎన్నో భారీ ప్రాజెక్టులను, పథకాలను తీసుకొచ్చింది. అందులో కొన్ని పూర్తికాగా, మరికొన్ని కొనసాగుతూ ఉన్నాయి. వేలకోట్ల అప్పులు తెచ్చి గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టింది. ఆ ప్రభుత్వం చేపట్టిన పథకాలు, ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం సమీక్షలు చేసి కొన్నింటిపై విచారణ కూడా చేయిస్తోంది.
తాజాగా ప్రగతి(ప్రజా)భవన్ నుంచి నాలుగు కంప్యూటర్లు మాయమైనట్టు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ఫలితాల రోజు రాత్రి వాటిని బయటకు తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. వాటిలో కీలకమైన డాటా ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వాటిని ఎవరు బయటకు తీసుకెళ్లారు? ఎవరు చెబితే తీసుకెళ్లారు? అవి సొంతానివా? లేదా ప్రభుత్వానివా? ఇలా అనేక కోణాల్లో అధికారులు ఆరా తీస్తున్నట్టు సమాచారం.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే అంటే డిసెంబర్ 3వ తారీఖున ప్రగతిభవన్ లో బీఆర్ఎస్ లీడర్లు, అధికారులతో హడావిడిగా ఉంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఫలితాలపై క్లారిటీ వచ్చిన వెంటనే అక్కడున్న లీడర్లు, అధికారులు ఒక్కొక్కరుగా బయటకు వెళ్లిపోయారు. అదే రోజు సాయంత్రం మాజీ సీఎం కేసీఆర్ తన సొంత కారులో ఫామ్ హౌజ్ కు వెళ్లారు. అక్కడ పనిచేసే కొందరు సిబ్బంది మాత్రమే ప్రగతి భవన్ లో ఉన్నారు. ఎప్పటి మాదిరిగానే పోలీస్ సెక్యూరిటీ ఉంది. రాత్రి 8గంటల తర్వాత ఓ వ్యక్తి ప్రగతి భవన్ కు కారులో వచ్చి 4 కంప్యూటర్లను తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. రెగ్యులర్ గా వచ్చే వ్యక్తి కావడంతో ఎవరూ అభ్యంతర పెట్టలేదని సమాచారం. అయితే రాత్రి వేళ వాటిని తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందనే అనుమానాలు వస్తున్నాయి.
కంప్యూటర్లను తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయినట్టు తెలుస్తోంది. వీటిని పూర్తిగా పరిశీలించిన తర్వాత సదరు వ్యక్తికి నోటీసులు జారీ చేసే అవకాశం ముందని సమాచారం. భవన్ ఇన్ చార్జిగా ఉన్న వ్యక్తిని విచారించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సెక్రటేరియెట్, ప్రగతిభవన్ లో కంప్యూటర్లను ఐటీ శాఖే ఏర్పాటు చేసింది. ఇక్కడి పూర్తి కంప్యూటర్లపై సమాచారం ఐటీ శాఖ వద్దే ఉంటుంది. అలాగే కంప్యూటర్లు అమర్చిన చోట, అక్కడి అధికారి నుంచి అక్నాలడ్జిమెంట్ తీసుకుంటారు. ప్రగతి భవన్ లో ఏర్పాటు చేసిన కంప్యూటర్లను లెక్కించినప్పుడు 4 కంప్యూటర్లు తక్కువ కనపడడంతో ఈ విషయం బయటపడింది.