JAISW News Telugu

Ayodhya : 17న అయోధ్యలో అద్భుతం..రామయ్యకు సూర్యాభిషేకం

Ayodhya

Ayodhya Rama

Ayodhya : అయోధ్య రామయ్య తన సొంత ఇంటిలో ఈ సారి శ్రీరామనవమి వేడుకలు జరుపుకోనున్నాడు.  గత జనవరిలో అయోధ్య రామయ్య విగ్రహ ప్రతిష్ఠాపన, రామాలయ ప్రారంభోత్సవం జరిగిన రోజు నుంచి అయోధ్య రూపురేఖలు మారిపోయాయి. ప్రతీ రోజు లక్షలాది మంది భక్తులు రామయ్యను దర్శించుకుంటున్నారు. దీంతో అయోధ్య పట్టణం రామభక్తులతో కిటకిటలాడుతోంది. దీంతో అయోధ్య లో వ్యాపార, వాణిజ్య, రవాణా, హోటల్, వసతి..గిరాకీ బాగా పెరిగింది. ఇక రామయ్య విగ్రహ ప్రతిష్ఠాపన తర్వాత తొలి శ్రీరామనవమి వేడుకలు ఈ నెల 17న జరుగనున్నాయి.

ఈ వేడుకల విశేషం ఏంటంటే.. ఆ రోజున అయోధ్య రామయ్య నుదిటిపై సూర్యకిరణాలు పడబోతున్నాయి. దీన్నే సూర్యతిలకం, సూర్య అభిషేకం అని పిలుస్తున్నారు. ఈ అరుదైన దృశ్యాన్ని చూసేందుకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ బెంగళూరు సైంటిస్టుల సహకారంతో సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ నిపుణులు ఇప్పటికే అయోధ్యలో క్యాంపింగ్ లో ఉన్నారు.

అయోధ్యలోని సూర్యవంశపు రాజు రామ్ లల్లాకు ఏప్రిల్ 17 మధ్యాహ్నం ‘సూర్య అభిషేకం’ జరుగుతుందని అధికారులు ప్రకటించారు. సూర్య కిరణాలు రామనవమి నాడు సరిగ్గా మధ్యాహ్నం సమయంలో భగవంతుని నుదిటిపై ప్రకాశించేలా  అత్యంత కచ్చితత్వంతో మార్గనిర్దేశం చేయబడుతాయి.

సూర్య కిరణాలు రామ్ లల్లా నుదిటిపై తదుపరి నాలుగు నిమిషాల పాటు 75 మిల్లీ మీటర్ల వరకు వృత్తాకారంలో ప్రకాశిస్తాయి. ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రక్రియను ప్రారంభించడం రామ మందిర ట్రస్ట్ ప్రణాళికలో ఉంది. సాధువులు, జ్ఞానుల అభ్యర్థనలను అనుసరించి, కొత్తగా నిర్మించిన ఆలయంలో మొదటి రామ నవమి రోజున ‘సూర్య అభిషేక’ ఏర్పాట్లు చేయడానికి సీబీఆర్ఐ నుంచి శాస్త్రవేత్తలు స్వచ్ఛందంగా ముందుకు రావడం విశేషం.

Exit mobile version