Ponnam Prabhakar : కేంద్రమంత్రి బండి సంజయ్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ

Ponnam Prabhakar
Ponnam Prabhakar : కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ కు తెలంగాణ రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బహిరంగ లేఖ రాశారు. కేంద్ర కేబినెట్ లో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్ కు పొన్నం ప్రభాకర్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. రాష్ట్రానికి, ప్రత్యేకంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి 2024-25 ఆర్థిక సంవత్సరానికి వచ్చే బడ్జెట్ సెషన్ లో తగినంత బడ్జెట్ కేటాయింపులు జరిగేలా చూడాలని కోరారు. తెలంగాణ అభివృద్ధికి, కేంద్ర నిధులు మంజూరుకు కృషి చేయాలని బండి సంజయ్ ను కోరారు.
రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు ఇచ్చిన హామీలు, వాగ్దానాలను నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం నిబద్ధతగా వ్యవహరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు, మిడ్ మానేర్, గౌరవెల్లి ప్రాజెక్టు భూనిర్వాసిత బాధిత కుటుంబాలకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు కృషి చేయాలని పేర్కొన్నారు.
శాతవాహన యూనివర్సిటీకి రూ.200 కోట్ల ఆర్థిక సహాయం అందించాలని, కరీంనగర్-తిరుపతి, కరీంనగర్-షిర్డీ రైల్వే మార్గాలను డబ్లంగ్ పనులను వేగవంతం చేయాలని, హుస్నాబాద్ లో మెడికల్్ కాలేజీ మంజూరుకు కృషి చేయాలని, కొత్తపల్లి-జనగాం జాతీయ రహదారి మంజూరు, సిరిసిల్ల టెక్స్ టైల్ పార్క్ అభివృద్ధికి నిధులు మంజూరుకు కృషి చేయాలని కోరారు. అలాగే వేములవాడ, కొండగట్టు ఆలయాల అభివృద్ధికి నిధులు, ఎన్ఎల్ఎం, పీఎంఈజీ మరియు ఎన్ హెచ్ఎం పథకాల కింద తగినంత బడ్జెట్ కేటాయింపునకు కృషి చేయాలని బహిరంగ లేఖలో పొన్నం ప్రభాకర్ విన్నవించారు.