Minister Nara Lokesh : మంత్రి నారా లోకేశ్ ‘ప్రజా దర్బార్’కు అనూహ్య స్పందన
Minister Nara Lokesh : మంత్రి నారా లోకేశ్ నిర్వహిస్తున్న ‘ప్రజా దర్బార్’కు అనూహ్య స్పందన లభిస్తోంది. బుధవారం ఉదయం నుంచే ఉండవల్లి నివాసం వద్ద వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, యువత, ఉద్యోగులు, వివిధ సంఘాల ప్రతినిధులు బారులు తీరారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ ప్రతి ఒక్కరి వద్ద వినతిపత్రాలు స్వీకరించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని వారికి భరోసా ఇచ్చారు. ఆయా సమస్యలను విభాగాల వారీగా విభజించి సంబంధిత శాఖలకు పంపాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
గత టీడీపీ ప్రభుత్వంలో మంజూరు చేసిన టిడ్కో ఇళ్ల రుణాన్ని మాఫీ చేసి ఆదుకోవాలని గుంటూరుకు చెందిన ఆశయ సాధన దివ్యాంగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు నారా లోకేశ్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. తన కుమారె్తకు పూర్తిస్థాయి అంగవైకల్యం ఉందని, దివ్యాంగ పింఛన్ మంజూరు చేయాలని మంగళగిరికి చెందిన షేక్ భానుబీ కోరారు. నులకపేటకు చెందిన ఆంజనేయులు దివ్యాంగ పింఛన్ కోసం విజ్ఞప్తి చేశారు.
పుట్టుకతో దివ్యాంగుడైన తాను డిగ్రీ చదివానని, ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన ఎం.వంశీకృష్ణ కోరారు. గత ప్రభుత్వంలో నిలిపివేసిన రైతుకూలీ పింఛన్ ను పునరుద్ధరించాలని యర్రబాలెంకు చెందిన ఎన్. వెంకటేశ్వరరావు విన్నవించారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తనకు నీట్ పరీక్ష ద్వారా బి-కేటగిరీలో ఎంబీబీఎస్ సీటు వచ్చిందని, ఫీజు రాయితీ కల్పించి ఆదుకోవాలని పల్నాడు జిల్లా అనంతవరానికి చెందిన సీహెచ్ అనూష విజ్ఞప్తి చేశారు. ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని లోకేశ్ వారికి భరోసా ఇచ్చారు.