Microsoft CEO Satyanadella : ఐదేళ్లుగా కొత్త పరిశ్రమలకు నోచుకోని ఆంధ్రప్రదేశ్ కు త్వరలో పెద్ద శుభవార్త అందనున్నట్లు తెలుస్తోంది. పారిశ్రామిక అభివృద్ధిపై దృష్టి సారించిన సంకీర్ణ ప్రభుత్వం పారిశ్రామిక వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ పూర్తి సహకారంతో ఏపీలో పరిశ్రమల స్థాపనకు మార్గం సుగమం అవుతోంది. మళ్లీ ఐటీ శాఖ మంత్రిగా ఎన్నికైన నారా లోకేశ్ తన ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లను కలవడం ఆసక్తికరంగా మారింది. ఏపీలో మైక్రోసాఫ్ట్ కంపెనీని స్థాపించి.. విస్తరించాలని ఆయన కోరినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన చొరవతోనే ఏపీకి పరిశ్రమ వస్తుందని ప్రచారం జరుగుతోంది.
అమెరికా పర్యటనలో ఉన్న నారా లోకేష్ ఇటీవల గ్లోబల్ సాఫ్ట్‌వేర్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లను కలిశారు. ఈ సందర్భంగా ఆయన సత్య నాదెళ్లకు ఏపీలోని పారిశ్రామిక అవకాశాలను వివరించారు. సత్య నాదెళ్ల కుటుంబానికి ఏపీతో ఉన్న అనుబంధాన్ని కూడా లోకేష్ గుర్తు చేశారు. సత్య నాదెళ్ల తండ్రి బీఎన్ యుగంధర్ ఐఏఎస్ అధికారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవన స్థితిగతులను మార్చేందుకు విశేష కృషి చేశారు.
టెక్నాలజీ రంగంలో ఏపీని అగ్రగామిగా నిలిపేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని నారా లోకేష్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఐటీ హబ్‌లు, ఇన్నోవేషన్ పార్కులను నిర్మిస్తున్నారు. వాటిని ప్రపంచ స్థాయి సాంకేతిక కేంద్రాలుగా తీర్చిదిద్దడంలో మైక్రోసాఫ్ట్ సహకారం అవసరం. క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డేటా సెంటర్ల ఏర్పాటుతో ప్రపంచ స్థాయి కంపెనీలకు ప్రాంతీయ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ మారే అవకాశం ఉందన్నారు. ఏపీలో సిద్ధంగా ఉన్న మౌలిక సదుపాయాలు, డిజిటల్ గవర్నెన్స్ వ్యూహాత్మక లాజిస్టిక్స్‌కు అనుకూలంగా ఉన్నాయని వివరించారు.
క్లౌడ్ ఆధారిత ప్లాట్‌ఫారమ్‌ల అమలు, డేటా అనలిటిక్స్ కోసం ఏఐ వినియోగం, సైబర్ సెక్యూరిటీని మెరుగుపరచడం, స్మార్ట్ సిటీ ప్రోగ్రామ్‌ల అభివృద్ధి కోసం చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న డిజిటల్ గవర్నెన్స్ విధానాలలో మైక్రోసాఫ్ట్ సహకారాన్ని లోకేష్ కోరారు. అమరావతిని ఏఐ రాజధానిగా చేస్తామని చెప్పారు. ఏపీలో డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, ఏఐ రంగాల అభివృద్ధికి సహకరిస్తానని సత్య నాదెళ్ల హామీ ఇచ్చారని లోకేష్ తెలిపారు.