Minister Nara Lokesh : జెట్ స్పీడ్ లో నిర్ణయాలు తీసుకుంటున్న మంత్రి నారా లోకేష్
Minister Nara Lokesh :ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏపీలో ఈసారి ఏర్పడిన కూటమి ప్రభుత్వం పాలనలో కొత్త అనుసరిస్తోంది. మంత్రులు ఎవరికి వారు ప్రజా సమస్యలను పరిష్కరించడం పైన గట్టిగా ఫోకస్ పెట్టారు. ఇక ఈసారి పాలనలో తన మార్కు చూపించడానికి మంత్రి నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తీసుకున్న ఒక సంచలన నిర్ణయం 25 మంది ప్రతిభవంతులైన దివ్యాంగ విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించింది. ప్రజలు తమకు అధికారం ఇచ్చింది ప్రజాసేవ చేసేందుకే అని నమ్మిన ఐటీ, విద్యా శాఖ మంత్రి లోకేష్ తమ భవిష్యత్ ఇక అంధకారం అయిపోయిందనుకున్న 25 మంది ప్రతిభవంతులైన దివ్యాంగ విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపారు. అధికారులను పరుగులు పెట్టించారు. దివ్యాంగ విద్యార్థులకు ఎదురైన సమస్యను సత్వరం పరిష్కరించారు.
దేశవ్యాప్తంగా ఉన్నటు వంటి ఐఐటీ, ఎన్ఐటీ లలో సీట్లకు అర్హత ఉన్న దివ్యాంగ విద్యార్థులు ప్రభుత్వం చేసిన చిన్న తప్పిదం కారణంగా సీట్లను కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఏపీలో దివ్యాంగులకు సెకండ్ లాంగ్వేజ్ ఎగ్జామ్ నుంచి మినహాయింపు ఉంది. సర్టిఫికెట్ లోను సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష వద్ద E(exemption) అని ఇస్తారు. ఇదే దేశంలోని ప్రఖ్యాత ఐఐటి, ఎన్ఐటి లలో సీట్లు సాధించడానికి అర్హత సాధించిన విద్యార్థులకు శాపమైంది. ఐఐటి మద్రాస్ అధికారులు 170 ర్యాంకు వచ్చిన ఒక దివ్యాంగ విద్యార్థికి సర్టిఫికెట్లో ఉన్న సెకండ్ లాంగ్వేజ్ వద్ద E అని ఉండడంతో.. అతడి ఉత్తీర్ణతకు కావలసిన ఐదు సబ్జెక్టులలో నాలుగు మాత్రమే పాస్ అయినట్లు సర్టిఫికెట్ చెల్లదని వెల్లడించారు. దీంతో దిక్కుతోచని స్థితిలో పృథ్వీ సత్యదేవ అనే విద్యార్థి మంత్రి లోకేష్ వాట్సాప్ నెంబర్ కు మెసేజ్ పెట్టారు. ఈ మెసేజ్ చూసి అరగంటలోనే స్పందించిన లోకేష్ అధికారులను పరుగులు పెట్టించారు. తక్షణం అతడి సమస్య పరిష్కరించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ప్రతిభ గల ఏ విద్యార్థి సీటు కోల్పోకూడదని చొరవ చూపారు. E అని ఇవ్వడానికి బదులుగా అక్కడ మార్కులు ఇచ్చి వారికి మెమో జారీ చేయాలని ఆదేశించారు. దీంతో వెంటనే ఇంటర్మీడియట్ అధికారులు స్పందించి E ని కనిష్టంగా 35 మార్కులుగా పేర్కొంటూ అందుకు తగినట్టుగా విద్యార్థులకు మెమోలను జారీ చేశారు.
సర్టిఫికెట్ తీసుకువెళ్లిన దానిని అంగీకరించబోమని ఏపీ ప్రభుత్వం నుంచి జీవో తీసుకుని రావాలని ఐఐటి, ఎన్ఐటి ల అధికారులు మెలిక పెట్టారు. దీంతో మళ్లీ పృథ్వి సత్యదేవ్.. ఫోన్ ద్వారా మంత్రి లోకేష్ కి విషయం తెలియజేశారు. విషయం తెలుసుకున్న మంత్రి లోకేష్ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వెంటనే జీవో విడుదల చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే చెన్నై ఐఐటి అధికారులతో మాట్లాడాలని గంటల వ్యవధిలోనే జీవో విడుదల చేశారు. ఒక దివ్యాంగ విద్యార్థి లోకేష్ దృష్టికి తన సమస్యను తీసుకురావడంతో మొత్తం 25 మంది ప్రతిభావంతులైన దివ్యాంగ విద్యార్థులకు జాతీయ స్థాయిలో పేరు పొందిన ఐఐటి, ఎన్ఐటి, త్రిబుల్ ఐటీ వంటి ప్రఖ్యాత విద్యా సంస్థలలో సీట్లు దొరికాయి. తమ సమస్యను వెంటనే పరిష్కరించిన మంత్రికి దివ్యాంగ విద్యార్థులు కృతజ్ఞతలు చెబుతున్నారు.