Minister Nara Lokesh : ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంకీర్ణ ప్రభుత్వం తనదైన మార్క్ పాలనను ప్రారంభించింది. ఇందులో భాగంగానే మంత్రులు కూడా రంగంలోకి దిగి ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుంటున్నారు. ఇందులో భాగంగానే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ప్రతిరోజు ప్రజా దర్బార్ నిర్వహించి మంగళగిరి నియోజకవర్గ ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అంతేకాకుండా ప్రజల కష్టాలను తెలుసుకునే విషయంలో మంత్రి లోకేష్ మరో అడుగు ముందుకేశారు.
ఉపాధి కోసం అరబ్ దేశాలకు వెళ్లిన తెలుగు వారు ఇబ్బందులు పడుతున్నారు. అక్కడి పరిస్థితులు, యజమానుల వేధింపులు భరించలేకపోతున్నారు. మరి కొందరు దళారుల చేతిలో మోసపోతున్నారు. ఇటీవల అన్నమయ్య జిల్లాకు చెందిన శివ అనే వ్యక్తి కువైట్‌లో చిక్కుకుని తను పడుతున్న కష్టాల వీడియోను విడుదల చేయడం వైరల్‌గా మారింది. వెంటనే స్పందించిన మంత్రి నారా లోకేష్.. ఎంబసీతోపాటు ఎన్నారైలతో మాట్లాడి శివను స్వగ్రామానికి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు.
తాజాగా ఏపీకి చెందిన మరో యువకుడు ఖతార్‌లో చిక్కుకోవడం.. అతడి వీడియో కూడా వైరల్ కావడంతో ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ.. తాను కూడా ఆయనకు అండగా ఉంటానని చెప్పారు. లోకేష్ భయపడకు సాయం చేస్తానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లాకు చెందిన సరెళ్ల వీరేంద్రకుమార్ స్వస్థలం అంబాజీపేట మండలం ఇసుకపూడి. ఏజెంట్ మాటలు నమ్మి ఉపాధి కోసం ఖతార్ వెళ్లాడు. ఖతార్ లో మంచి ఉద్యోగం ఉందని చెప్పడంతో వీరేంద్ర కుమార్ వీసా కోసం ఏజెంట్ కు రూ.1,70,000 చెల్లించాడు. వీరేంద్రకుమార్ డబ్బులు చెల్లించి ఖతార్ కు వీసా పొందాడు.
వీరేంద్ర ఈ నెల 10న ఖతార్ చేరుకున్నారు. అక్కడి నుంచి సౌదీ అరేబియాలోని ఎడారి ప్రాంతానికి 11న ఓ వ్యక్తి తీసుకెళ్లి వదిలేశాడు. తాను మోసపోయానని వీరేంద్ర గ్రహించాడు. చివరకు ఫోన్‌లో వీడియో తీసి కుటుంబ సభ్యులకు పంపించాడు. దీన్ని నారా లోకేష్ స్నేహితుల సహకారంతో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో చూశాడు. వెంటనే స్పందించిన లోకేష్ వీరేంద్రను ఇంటికి తీసుకొచ్చేలా చర్యలు తీసుకున్నారు. భయపడాల్సిన అవసరం లేదని, తిరిగి ఇంటికి తీసుకువస్తామని ఎక్స్ లో పోస్ట్ చేశారు. దీంతో వీరేంద్ర కుటుంబం ఊపిరి పీల్చుకుంది. ఎన్ఆర్ఐ టీడీపీని అలర్ట్ చేసి వీరేంద్రను స్వదేశానికి పంపారు.