Minister Konda Surekha : మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. గజ్వేల్ పర్యటన సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని తమపై పిచ్చి రాతలు రాయిస్తున్నారని మండిపడ్డారు. తొమ్మిది హామీలు అమలు చేస్తే పదో హామీ ఎందుకు అమలు చేయలేదని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారని అన్నారు.
పదవీ కాంక్షతో కేసీఆర్ ను కేటీఆర్ ఏదో చేశారనే ప్రచారం జరుగుతోందని, కేటీఆర్ సీఎం అనుకొని పిచ్చి నిర్ణయాలు తీసుకున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ ఓడిపోవడానికి కూడా ప్రధాన కారణం కేటీఆర్ అని చెప్పారు. బడ్జెట్ రోజు అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ మళ్లీ కనిపించలేదన్నారు. ఫాంహౌస్లో ఏంచేస్తున్నారో తెలియదు. గజ్వేల్ లో కేసీఆర్ కనిపించడం లేదని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తామని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం జరిగిందని ఆరోపించారు. కవిత బెయిల్ కోసం ప్రధానితో మాట్లాడి ఒప్పందం చేసుకొని, బీఆర్ఎస్ నుంచి బీజేపీకి క్రాస్ ఓటింగ్ జరిగిందని కొండా సురేఖ విమర్శించారు.