Gottipati : సమస్యలకు స్పందించాలనుకుంటే సత్వరం పరిష్కారం దొరుకుతుందనడానికి ఇది ఒక ఉదాహరణ. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తన సొంత జిల్లాలో మూడేళ్లుగా ముప్పుతిప్పలు పడుతున్న ఓ రైతు సమస్యకు మాత్రం పరిష్కారం చూపలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం స్పందించడంతో మూడు గంటల వ్యవధిలోనే ఆ రైతు సమస్య పరిష్కారమైంది.
వైఎస్సార్ జిల్లా ఖాజీపేట మండలం నాగసానిపల్లెకు చెందిన గంగయ్య పొలంలో విద్యుత్తు తీగలు నేలను తాకుతుండేవి. దాంతో పొలం పనులు చేసేటప్పుడు ప్రమాదకరమని తెలిసినా కుటుంబ సభ్యులతో కరెంట్ తీగలను కర్రలతో పైకెత్తి తర్వాత వదిలివేసేవారు. ఈ సమస్యను మూడేళ్లుగా ప్రజాప్రతినిధులు, ఎస్పీడీసీఎల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదు.
ఇటీవల వర్షాలు పడడంతో దుక్కి చేయడానికి మంగళవారం ఉదయం రైతు పొలానికి వెళ్లారు. ఎప్పటిలాగానే తీగలను పైకెత్తి దుక్కి చేస్తున్నారు. ఈ క్రమంలో దారిన వెళ్తున్న కొందరు తమ ఫోన్లలో ఫొటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఇది విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ దృష్టికి వెళ్లింది. స్పందించిన మంత్రి ఆ జిల్లా ఎస్పీడీసీఎల్ ఎస్ఈ రమణతో ఫోన్లో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. దీంతో ఆయన తమ సిబ్బంది ద్వారా విద్యుత్తు స్తంభాన్ని పొలానికి పంపించి మూడు గంటల వ్యవధిలోనే తీగలను సరిచేయించారు.