MIM vs Congress : ఎంఐఎం వర్సెస్ కాంగ్రెస్.. ఒకరిపై ఒకరు దాడులు

MIM vs Congress
MIM vs Congress : నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్, కాంగ్రెస్ నాయకుడు ఫిరోజ్ ఖాన్ మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. వారి అనుచరులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించారు. విజయనగర్ కాలనీ డివిజన్ ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర సీసీ రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. పనులను పరిశీలించేందుకు వెళ్లిన ఫిరోజ్ ఖాన్, స్థానిక ఎంఐఎం నాయకుల మధ్య ఘర్షణ ఏర్పడింది.
ఎంఐఎం నాయకులపై ఫిరోజ్ ఖాన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వెళ్లారు. వెంటనే అనుచరులతో కలిసి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో ఒకరిపై ఒకరు దూషించుకుంటూ దాడికి దిగారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇరువర్గాలూ రాళ్లు రువ్వుకున్నాయి. ఆసిఫ్ నగర్ ఇన్ స్పెక్టర్ ఇరువర్గాలను సముదాయించి అక్కడి నుంచి పంపించి వేశారు. దీనిపై ఎవరు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. డీసీపీ చంద్రమోహన్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.