Metro Train : సాంకేతిక కారణాలతో నిలిచిన మెట్రోరైలు
Metro Train : సాంకేతిక కారణాలతో బుధవారం సాయంత్రం మెట్రో రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది. మియాపూర్ – ఎల్బీ నగర్ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. సాంకేతిక కారణాలతో రైళ్లను నిలిపివేసినట్లు లోకో పైలట్లు తెలిపారు. హైదరాబాద్‌లో భారీ వర్షాల కారణంగా రోడ్లపై ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో చాలామంది ప్రయాణికులు మెట్రో రైలు ఎక్కారు. మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వస్తున్న మెట్రోరైలు ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ వద్ద నిలిచిపోయింది. కొంత సమయం రైలు తలుపులు తెరుచుకోక పోవడంతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఎల్బీ నగర్ స్టేషన్ వద్ద ఎగ్జిట్ మిషన్లు మొరాయించాయి. మెట్రో స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.
ఈ సమస్యపై ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రోరైలు సంస్థ స్పందించింది. జోరువాన, గాలుల కారణంగా ఎంజీబీఎస్ ట్రాన్స్ కో ఫీడర్ ట్రిప్ అండంతో విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడిన కారణంగా సేవల్లో అంతరాయం ఏర్పడిందని పేర్కొంది. ప్రత్యామ్నాయంగా మియాపూర్ ఫీడర్ నుంచి అనుసంధానం చేసి ఏడు నిమిషాల్లోనే సేవలను పునరుద్ధరించినట్లు వివరించింది.