Ex CM Jagan : కాంగ్రెస్ లో వైసీపీ విలీనం.. జగన్ అడుగులు అటువైపేనా?

Ex CM Jagan

Ex CM Jagan

Ex CM Jagan : సార్వత్రిక ఎన్నికల తర్వాత రాజకీయాల్లో శరవేగంగా మార్పులు జరుగుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విపక్ష బీఆర్ఎస్ ను ఖాళీ చేసేందుకు ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించింది. దీంతో గులాబీ పార్టీ అప్రమత్తమై పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. అధికార కూటమికి 164 సీట్లు రాగా, విపక్ష వైసీపీకి 11 స్థానాలు వచ్చాయి. దీంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది.

ఈ నేపథ్యంలో పులివెందుల నియోజకవర్గంలో మూడు రోజులు మాజీ సీఎం జగన్ పర్యటించారు. నియోజకవర్గంలో పార్టీ ఓటమిపై మేధో మధనం చేసిన జగన్.. కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కునేందుకు కాంగ్రెస్ లో వైసీపీని విలీనం ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. నియోజకవరంలో పర్యటించిన అనంతరం జగన్ బెంగళూరు వెళ్లారు. ఏపీలో ఉనికే లేని కాంగ్రెస్ పార్టీలో వైసీపీని విలీనం చేయాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తన ప్రతిపాదనను కర్ణాటక పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ముందు ఉంచినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వైసీపీలో ఉన్న 11మంది ఎమ్మెల్యేలలో ఎంతమంది పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి ఉండడంతో మాజీ సీఎం ఈ అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైసీపీలో ఉన్న నలుగురు ఎంపీలలో కూడా ఎందరూ ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. జగన్ దూతగా వ్యవహరించే ఎంపీ విజయసాయిరెడ్డి సైతం బీజేపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది.

ఈ పరిస్థితుల్లో వైఎస్ జగన్ తన ఉనికి కాపాడుకునేందుకు కాంగ్రెస్ లో వైసీపీ విలీన ప్రతిపాదన చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.

TAGS