CM Yogi Adityanath : ఆరు నెలల్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే) భారత్ లో విలీనమవుతుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. నరేంద్ర మోదీ ప్రధానిగా ఉంటేనే అది సాధ్యమవుతుందని తెలిపారు. శనివారం పాల్ఘర్ లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారంలో యోగి పాల్గొని ప్రసంగించారు. గత పదేళ్లలో నవభారత నిర్మాణాన్ని చూశామని, సరిహద్దులో భద్రత కట్టుదిట్టం చేశామని, ఉగ్రవాదాన్ని అరికట్టామని యోగి తెలిపారు.
గత మూడేళ్లుగా పాకిస్థాన్ లో అనేక మంది ఉగ్రవాదులు హతమయ్యారన్న యోగి.. దాని వెనుక భారత ఏజెన్సీల హస్తం ఉన్నట్లు ఆంగ్ల పత్రికల కథనాలు పేర్కొంటున్నాయని అన్నారు. భారత ప్రజలను చంపినవారిని మనం పూజించలేం కదా అన్న ఆయన, తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. పీవోకేను ఆక్రమించేందుకు పాక్ తీవ్రంగా యత్నిస్తోందని, కానీ అది వారికి సాధ్యం కాదని పేర్కొన్నారు. ‘‘మరో ఆరు నెలల్లో అది పూర్తిగా భారత్ లో విలీనమవుతుంది, కానీ మూడోసారి కూడా మోదీయే ప్రధానిగా బాధ్యత వహిస్తేనే అది జరుగుతుంది’’ అని యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు.