AP BJP MPs : విశాఖ స్టీల్ ను సెయిల్ లో విలీనం చేయండి: ఏపీ బీజేపీ ఎంపీల వినతి
AP BJP MPs : విశాఖ స్టీల్ ప్లాంట్ ను స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్)లో విలీనం చేయాలని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, ఎంపీ సీఎం రమేశ్ లు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్ డీ కుమారస్వామిని కోరారు. కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మతో కలిసి బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేశారు.
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కులో భాగంగా ప్రజల నిరంతర పోరాటంతో వైజాగ్ నగరంలో రాష్ట్రీ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్)ను ఏర్పాటు చేసినట్లు వారు మంత్రికి వివరించారు. ఉక్కు కర్మాగారం పెద్ద ఉపాధిని కల్పించిందని, పారిశ్రామికంగా వైజాగ్ నగరాన్ని అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించిందని వారు తెలిపారు. స్టీల్ ప్లాంట్ ఉజ్వల భవిష్యతు కోసం సెయిల్ లో విలీనం చేయాలని మంత్రి కుమారస్వామికి బృందం విజ్ఞప్తి చేసింది. దీంతో సానుకూలంగా స్పందించిన మంత్రి, అధికారులతో వరుస సమావేశాల అనంతరం విశాఖ స్టీల్ ప్లాంట్ పై నిర్ణయం తీసుకుంటామని, రెండు నెలల తర్వాత మరల సమావేశమవుతామని ఎంపీలకు హామీ ఇచ్చారు.