Megastar donation : రెండు తెలుగు రాష్ట్రాల్లో గత శుక్రవారం నుంచి మంగళవారం వరకు కురిసిన భారీ వర్షాలకు ఎన్నో పట్టణాలు, గ్రామాలు నీట మునిగాయి. పంట పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. తెలంగాణలోని ఖమ్మం నగరం నీట మునిగింది. దాదాపు రెండు నుంచి మూడు అంతస్తుల వరకు నీరు ప్రవహించడంతో పట్టణ వాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కు మంటూ గడిపారు.
తినడానికి తిండి లేదు. తాగడానికి నీరు లేదు. ఎలా ఉన్నామని చెబుతామంటే ఫోన్లలో చార్జింగ్ లేదు. కరెంట్ లేదు. ఇలా వారు పడిన నరకయాతన అంతా ఇంతా కాదు. శనివారం మధ్యాహ్నం ప్రారంభమైన వాన ఆదివారం, సోమవారం కూడా దంచికొట్టింది. దీంతో విజయవాడ సిటీ మొత్తం నీట మునిగింది. అనేక కాలనీల్లోకి నీళ్లు వచ్చాయి. ఏకంగా సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడ సిటీలోని లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి ప్రజల కష్టాలను తెలుసుకున్నారు. వర్షాలు, వరదలు తగ్గే వరకు కలెక్టరేట్ ఆఫీసులోనే ఉంటానని వారికి భరోసా ఇచ్చారు.
కాగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సెలబ్రెటీలు ఈ విషాదాన్ని చూసి చలించిపోతున్నారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ ఒక్కో తెలుగు రాష్ట్రానికి రూ. 50 లక్షల చొప్పున పరిహారం ఇస్తున్నట్లు ప్రకటించాడు. కాగా ఈ జాబితాలోకి మెగాస్టార్ చిరంజీవి చేరిపోయారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో జరిగిన వరద నష్టం నివారణ అంచనా వేయలేనిది. పొలాలు, ఇండ్లు కొట్టుకుపోయి చాలా మంది నిరాశ్రయులయ్యారు. ఇంత దారుణమైన పరిస్థితి నుంచి తొందరగా బయట పడాలని కోరుకుంటున్నా. నా వంతుగా రెండు తెలుగు రాష్ట్రాలకు రూ. కోటి అందజేస్తున్నట్లు ప్రకటించాడు.
వెంకయ్యనాయుడు సైతం తన పెన్షన్ నుంచి రూ. 5 లక్షల చొప్పున నష్ట పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. సినీ పెద్దలు కలిసి ఆదుకుంటే బాగుంటుందని చాలా మంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా తెలంగాణలో మహాబూబాబాద్, ఖమ్మం, ఆంధ్రప్రదేశ్ లో అమరావతి, విజయవాడ ఎక్కువగా వర్ష ప్రభావితమైన ప్రాంతాలుగా గుర్తించబడ్డాయి.