CM Revanth reddy:కొత్త సీఎం పూణే తరహా ఫిలింఇనిస్టిట్యూట్ తెస్తారా?
CM Revanth reddy:తెలంగాణను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రెండు దఫాలుగా అజేయంగా పాలించాడు. మూడో దఫా కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యాడు. అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఉద్యమం నేపథ్యంలో హైదరాబాద్ లో తిష్ఠ వేసిన ఆంధ్రులపై తెరాస ప్రభుత్వం కత్తి గట్టిన విషయం మరువలేనిది. అయితే అప్పట్లోనే టాలీవుడ్ ని టార్గెట్ చేసి బెదిరింపులకు పాల్పడడం కూడా చర్చకు వచ్చింది. అయితే ప్రత్యేక తెలంగాణ ఏర్పడి, తెరాస ప్రభుత్వం ఏర్పాటయ్యాక అందుకు భిన్నంగా సినీపరిశ్రమ ఎటూ తరలిపోకుండా కేసీఆర్- కేటీఆర్ జోడీ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.
తెలుగు సినీపరిశ్రమకు అవసరమైన సపోర్టుని తెరాస నాయకులు అందించడంతో పరిశ్రమ ఎటూ కదల్లేదు. ఆసక్తికరంగా ఇప్పుడు కొత్త సీఎం రేవంత్ రెడ్డి టాలీవుడ్ విషయంలో ఎలాంటి పాలసీని అమలు చేయబోతున్నారు? అంటే.. ఇటీవల రకరకాల సందేహాలు తలెత్తాయి. రేవంత్ టాలీవుడ్ ని టార్గెట్ చేస్తూ పాత `డ్రగ్ డొంక`ను కదుపుతున్నారని కథనాలు వెలువడ్డాయి. గతంలో డ్రగ్స్ లో పట్టుబడిన స్టార్లు, సెలబ్రిటీల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం ఏమంత పట్టించుకోలేదు. అందుకే వారిపై మరోసారి కొత్త సీఎం సారథ్యంలో ఇంటరాగేషన్ షురూ చేస్తారని, ఆ మేరకు నగర డీసీపీ సహా హై క్యాడర్ పోలీస్ అధికారులతో మంతనాలు సాగించారని కూడా టాక్ వినిపించింది.
డ్రగ్స్ విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదని కూడా కొత్త సీఎం వ్యాఖ్యానించారని చెబుతున్నారు. మరోవైపు ప్రభాస్ నటించిన భారీ చిత్రం సలార్ విడుదలకు రెండు రోజుల ముందు వరకూ టికెట్ పెంపు గురించి కొత్త సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం సందేహాలకు తావిచ్చింది. ఇక ఇలాంటి సమయంలో కొత్త సీఎం రేవంత్ ని నేరుగా ఆయన ఇంట్లో కలిసారు మెగాస్టార్ చిరంజీవి. పూలబోకేతో పలకరించి శుభాకాంక్షలు తెలియజేసారు. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇప్పటికే ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. అయితే కొత్త ముఖ్యమంత్రి రేవంత్ తో చిరు ఏం మాట్లాడి ఉంటారు? అన్నది సస్పెన్స్ గా మారింది.
పరిశ్రమ సమస్యల్ని ప్రస్థావించి సానుకూలంగా ఉండాలని సీఎంని కోరారా? అన్న చర్చా సాగుతోంది. చాలా కాలంగా తెలంగాణలో తెలంగాణ కళాకారులు సినీరంగంలో ఎదగాలన్న ఆకాంక్ష బలంగా ఉంది. అది జరగాలంటే హైదరాబాద్ పరిసరాల్లో పూణే ఫిలింఇనిస్టిట్యూట్ తరహా ఇనిస్టిట్యూట్ ని ప్రారంభించి స్థానికులకు శిక్షణ కల్పించాలని కూడా కొందరు కోరుతున్నారు. స్థానిక ప్రతిభను సానబట్టాలంటే అందుకు రాయితీలతో శిక్షణనిచ్చే సినీశిక్షణ సంస్థల అవసరం ఎంతైనా ఉంది. తెరాస ప్రభుత్వం తీరుగా కాకుండా టాలీవుడ్ విషయంలో కొత్త సీఎం సమర్థంగా ఆలోచించాలని కోరుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి దీనిపై ఏం ఆలోచిస్తున్నారో వేచి చూడాలి.