Megastar Chiranjeevi Rajya Shaba : మెగాస్టార్ చిరంజీవి దేశం యావత్తు పరిచయం అవసరం లేని పేరు. టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్దన్నగా కొనసాగుతున్న ఆయన ప్రస్థానం, ప్రయాణం అందరికీ స్ఫూర్తిదాయకమే. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన ఆయన అంచెలంచెలుగా పద్మ విభూషణ్ పురస్కారం వరకు ఎదిగారు. ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మ పురస్కారం అందజేసి గౌరవించింది. ఇదంతా పక్కన పెడితే ఆయన మళ్లీ రాజకీయ ప్రవేశంపై తీవ్ర చర్చ మొదలైంది. మెగాస్టార్ చిరంజీవిని యూపీ నుంచి రాజ్యసభకు పంపించాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
మళ్లీ రాజకీయ ప్రవేశం!
తన నటనా కెరీర్ ను కొంత కాలం పక్కన పెట్టాలని నిర్ణయించుకున్న చిరంజీవి 2008, ఆగస్ట్ 26న ‘ప్రజారాజ్యం’ పార్టీని పెట్టారు. ‘ప్రజలే పాలకులు నేను వారధి’ అంటూ ప్రచారం చేశారు. 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన సభకు పోటీ చేసిన ఆయన 294 స్థానాలకు గానూ 18 స్థానాల్లో విజయం సాధించారు. మొత్తంగా 18 శాతం ఓట్లను ప్రజారాజ్యం దక్కించుకుంది. ఆ తర్వాత కొంత కాలానికి తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఆ సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ మెగాస్టార్ కు కేంద్ర మంత్రి పదవి ఇచ్చింది. ఆ తర్వాత కొంత కాలానికి ఆయన రాజకీయాల్లో నుంచి తప్పుకుని నటన వైపునకు వచ్చాడు.
ఈ నేపథ్యంలో ఆయన ఇప్పుడు మళ్లీ రాజకీయాల్లోకి తిగిరి వెళ్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులు కూడా అదే నిజమని నిరూపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు సైతం చెప్తున్నారు. అసలు వివరాల్లోకి వెళ్తే..
లోక్ సభ ఎన్నికలకు కేవలం నెలల గడువు మాత్రం ఉండడంతో దేశ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నారు. జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకొని పార్లమెంట్ స్థానాలను గెలిపించుకునేందుకు పావులు కదుపుతున్నాయి. ఇందులో భాగంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ హ్యాట్రిక్ కోసం పరితపిస్తుంది. అందుకే వచ్చిన ఏ అవకాశాన్ని వదులు కోవడం లేదు. దక్షిణాదిలో ఏపీపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా దగ్గర పడుతుండడంతో పక్కాగా పావులు కదుపుతుంది.
కాపు సామాజిక ఓట్లను తన ఖాతాలోకి మళ్లించుకునేందుకు మెగాస్టార్ ను రాజ్యసభకు పంపనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఏపీలో జనసేనకు కొత్త ఊపు వస్తుందని భావిస్తోంది. అందుకే శ్రీరాముడి ప్రాణ ప్రతిష్టకు రావాలని కోరింది. దీంతో పాటు దేశ రెండో అత్యున్నత పురస్కారం ‘పద్మ విభూషణ్’ కూడా అందజేసింది. ఇప్పటి వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న జీవీఎల్ నరసింహారావు స్థానంలో మెగాస్టార్ ను రాజ్యసభకు పంపుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడే కాకుండా బిహార్ లో కూడా ఇలాంటి స్ట్రాటజీనే బీజేపీ అమలు చేసింది. అక్కడ ప్రజల్లో విపరీతమైన ఆదరణ కలిగిన నేత మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ కు దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ప్రకటించింది.
ఏది ఏమైనా చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా? అన్న అనుమానం ఒక వైపు కలుగుతున్నా.. ఒక వేళ నిజమైతే.. బీజేపీ అంచనాలు అన్నీ సక్సెస్ అవుతాయని, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కలిసి రావచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు.