Medigadda Barrage : మేడిగడ్డ రెండు గేట్లను తొలగించాలి: నిపుణుల కమిటీ
Medigadda Barrage : మేడిగడ్డలో బ్యారేజీ రెండు గేట్లను పూర్తిగా తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి నిపుణుల కమిటీ సూచించింది. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీలో పియర్స్ దెబ్బతిన్న సంగతి తెలిసిందే. తాజాగా నిపుణుల కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి బ్యారేజీ గురించి కీలక సిఫార్సు చేసింది.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీలో పియర్స్ కుంగిన ఏడో బ్లాకులో తెరుచుకోని ఎనిమిది రేడియల్ గేట్లలో రెండింటిని పూర్తిగా తొలగించాలని చెప్పింది. మిగతా ఆరు గేట్లను పూర్తిగా పైకి ఎత్తి ఉంచడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించింది.ఇలా చేయడంలో సమస్య వస్తే ఆ గేట్లను కూడా తొలగించాలని, దెబ్బతిన్న సీసీ బ్లాకులు తీసేసి మళ్లీ కొత్తగా అమర్చాలని తెలిపింది.
వర్షా కాలం లోగా మరమ్మతులు చేయకుంటే బ్యారేజీలకు మరింత నష్టం వాటిల్లే అవకాశం ఉన్నందున తక్షణం చేపట్టాల్సిన చర్యలతో మధ్యంతర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీంతో మధ్యంతర నివేదికలో నిపుణుల కమిటీ పలు సూచనలు చేసింది.