Medaram Jathara : మరికొన్ని గంటల్లో సమ్మక్క ఆగమనం.. చిలకలగుట్ట వద్ద తీవ్ర ఉద్విగ్నత..

Medaram Jathara : మేడారం మహా జాతర జోరుగా సాగుతోంది. కోట్లాది భక్తులతో కీకారణ్యం జనారణ్యంగా మారిపోయింది. ఇసుక వేస్తే రాలనంత జనంతో మేడారం పరిసరాలు నిండిపోయాయి. మేడారం చుట్టూ పదుల కిలోమీటర్ల పరిధిలో ఎటూ చూసినా జనాలే ఉన్నారు. మేడారం వెళ్లే దారులపై వాహనాలు బారులు తీరాయి.

బుధవారం మొదటి రోజు కీలక ఘట్టమైన సారలమ్మ గద్దెలపైకి చేరింది. లక్షలాది మంది భక్తులు తోడురాగా కన్నెపల్లి నుంచి సారలమ్మ అమ్మవారిని ఆదివాసీ పూజారులు డోలు వాయిద్యాలతో తోడ్కోని వచ్చి గద్దెలపై ప్రతిష్ఠించారు. పగిడిద్దరాజు, గోవిందరాజులనూ గద్దెలపై కొలువుదీర్చారు.

Medaram Jathara

Medaram Jathara 2024

ఇవాళ (గురువారం) కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మేడారానికి చేరుకుని సారలమ్మ తల్లికి మొక్కులు అప్పజెప్పారు. ఇక సాయంత్రం చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లిని గద్దెలపైకి తీసుకొచ్చి ప్రతిష్ఠించనున్నారు. దీని కోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లిని పూర్తి వందలాది పోలీసుల రక్షణ మధ్య గద్దెలపైకి తీసుకొస్తారు.

చిలకలగుట్టలోని ఓ రహస్య ప్రదేశం నుంచి సమ్మక్కను కుంకుమ భరిణె రూపంలో సమ్మక్క పూజారులు తీసుకొని వస్తారు. సమ్మక్కను తీసుకొచ్చే ముందుకు అమ్మవారు బయలుదేరుతుందనడానికి సిగ్నల్ గా ఎస్పీ తుపాకీతో ఆకాశంపైకి కాల్పులు జరుపుతారు. ఆ తర్వాత తల్లిని ఊరేగింపు మధ్య గద్దెలపైకి చేర్చుతారు.

Medaram Jathara
ఆ తర్వాత ఇద్దరు తల్లులు గద్దెలపై కొలువుదీరగా భక్తులు రేపు, ఎల్లుండి దర్శించుకుంటారు. ఎల్లుండి శనివారం తల్లుల వన ప్రవేశం ఉంటుంది. దీంతో మహా జాతర ముగిసిపోతుంది. నాలుగు రోజులు మహా నగరంగా వెలుగొందిన మేడారం.. ఆ తర్వాత నిశబ్దఒడిలోకి జారుకుంటుంది.

TAGS