Mayank Yadav : గతంలో ఐపీఎల్ అంటే ఫ్రాంచైజీలకు కాసులు కురిపించే ఆట తప్పితే దేనికి పనికి రాదు అనేవారు. ఐపీఎల్ తో క్రికెట్ చచ్చిపోతుంది అన్నవారు కూడా ఉన్నారు. ఐపీఎల్ మ్యాచుల్లో కాసుల కోసమే ఆడుతారు..ఇక భారత జట్టుకు వన్డేలు, టెస్ట్ లకు ప్రాధాన్యమివ్వరు అని కూడా అన్నారు. కానీ ఐపీఎల్ తో ఎంతో మంది మట్టిలో మాణిక్యాలు వెలుగులోకి వస్తున్నాయి. మనవాళ్లలో దాగి ఉన్న ప్రతిభను అది వెలికితీస్తోంది. ‘‘నీలో ఆట ఉంటే చాలు అదే అవకాశాలను నీ ఇంటి గుమ్మం దాక తెస్తుంది’’ అనే మాటకు ఐపీఎల్ లో ఆటగాళ్ల ప్రతిభే నిదర్శనం. ఐపీఎల్ లో ఎన్నో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నా ఎంతో మంది ప్రతిభకు పట్టం కడుతోంది అనడంలో సందేహం లేదు.
ఈ ఐపీఎల్ సీజన్ లో మన క్రికెట్ ఓ అద్భుత ఆయుధం దొరికింది మయాంక్ యాదవ్ రూపంలో. బుల్లెట్ లాంటి బంతులతో ఆకట్టుకుంటున్నాడు. నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థులను ఆటాడుకుంటున్నాడు. ఇప్పటి లక్నో జట్టు ఆడిన మూడు మ్యాచ్ ల్లో రెండింటిలో విజయం సాధించడంలో మయాంక్ యాదవ్ కీలక పాత్ర పోషించాడు.
నిన్న జరిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లను లక్నో సూపర్ జెయింట్స్ స్పీడ్ బౌలర్ మయాంక్ యాదవ్ ముప్పుతిప్పలు పెట్టాడు. మయాంక్ విజృంభణతో (3/14)తో 28 పరుగుల తేడాతో బెంగళూర్ ను లక్నో ఓడించింది. మయాంక్ యాదవ్ తన ఖాతాను మాక్స్ వెల్ ను ఔట్ చేయడం ద్వారా ప్రారంభించాడు. సున్న పరుగులకే అతన్ని పెవిలియన్ కు పంపాడు. కాసేపటికే తర్వాత గ్రీన్(9)ను బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత 15 ఓవర్ లో పటీదార్ ను వెనక్కి పంపేశాడు. మయాంక్ ఈ మ్యాచ్ లో మూడు వికెట్లు తీసి కేవలం 14 పరుగులు ఇవ్వడం విశేషం.
ఇక ఈ మ్యాచ్ లో 156.7 కి.మీ. వేగంతో బంతి విసిరి అందరినీ ఔరా అనిపించారు. ఈ ఏడాది ఐపీఎల్ లో ఇదే అత్యంత వేగవంతమైన బంతి. అలాగే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా 3 సార్లు 155 కి.మీ. ఎక్కువ వేగంతో బంతులు వేసి రికార్డులకెక్కాడు. మాయంక్ కేవలం 2 మ్యాచ్ ల్లో 50 కంటే తక్కువ బంతులే వేసి ఈ ఫీట్ సాధించారు. ఉమ్రాన్ మాలిక్, నోర్ట్జే రెండు సార్లు ఈ రికార్డు అందుకున్నారు. కాగా, ఐపీఎల్ హిస్టరీలో షాన్ టెయిట్ వేసిన 157.7 కి.మీ. బాల్ రికార్డ్ ను ఇప్పటివరకూ ఎవరూ బద్దలు కొట్టలేదు. అయితే ఈ సీజన్ లో మన మయాంక్ యాదవ్ కొట్టే అవకాశాలు లేకపోలేదు. ఇంకా చాలా మ్యాచ్ లు ఉన్నాయి కాబట్టి ఆ రికార్డు బద్దలు కొడితే ఇక మయాంక్ ను ఆపేవారే లేరు.