Viral Video : అమెరికాలో భారతీయుల వ్యాపార సముదాయాలపై దోపిడీలు కొనసాగుతున్నాయి. కొంత కాలంగా ఎలాంటి దోపిడీ లేవని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో తాజాగా అమెరికాలోని ఓ భారతీయ ఎన్నారై నగల దుకాణంలో పట్టపగలు భారీ చోరీ జరగడంతో మరోసారి భారత ఎన్నారైలు ఉలిక్కిపడాల్సి వచ్చింది. ఎంతో మంది అమెరికన్స్, ఎన్నారైలు ఈ దుకాణంలో నగలు కొనుగోలుకు వస్తుంటారు. ఈ క్రమంలోనే బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటకు దాదాపు 15 మంది గుర్తు తెలియని సాయుధులైన దుండగులు నగల దుకాణంలోకి ప్రవేశించి భారీ చోరీకి పాల్పడ్డారు.
కాలిఫోర్నియాలోని ఫ్రెమాంట్ లోని భిండి జ్యువెల్లర్స్ లో జరిగిన మరో పగటి దోపిడీతో యునైటెడ్ స్టేట్స్ లోని భారతీయ సమాజం వణికిపోతోంది. బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటకు 3 కార్లలో 15 మంది సాయుధులు వచ్చి 5 నిమిషాల్లో దోచుకున్నారు. దుకాణంలోకి చొరబడిన దుండగులు డిస్ ప్లే కేస్ లను పగులగొట్టి పలు రోలెక్స్ గడియారాలతో పాటు బంగారం, వజ్రాభరణాలను ఎత్తుకెళ్లారు.
న్యూయార్క్, న్యూజెర్సీ, వర్జీనియా, ఫ్లోరిడా, పెన్సిల్వేనియా సహా పలు రాష్ట్రాల్లోని భారతీయ నగల దుకాణాలను లక్ష్యంగా చేసుకుని వరుస సాయుధ దోపిడీలకు పాల్పడిన డజను మందికి పైగా సభ్యులను ఎఫ్ బీఐ గత సంవత్సరం అరెస్టు చేసింది. అయినా కూడా భారతీయ వ్యాపార, వాణిజ్య సముదాయాల దోపిడీ ఆగడం లేదు. ఫ్రెమాంట్ జ్యువెల్లర్స్ షాపులో దోపిడీ అనంతర పరిణామాలను చిత్రీకరించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఆ వీడియోలో 15 మంది ఒక్కసారిగా దుకాణంలోని అద్దాలను పగులగొట్టి కోట్ల విలువ చేసే నగలను దోచుకెళ్లారు. ఈ దోపిడీలో అక్కడున్న వారికి అదృష్టవశాత్తు ఎవరికీ గాయాలు కాలేదు. ఒక అనుమానితుడు సమీపంలోని మాల్ వైపు, మరొకరు హైస్కూల్ వైపు పారిపోవడాన్ని ప్రత్యక్ష సాక్షులు చూశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. భారతీయ ఆభరణాలు, గడియారాలకు ప్రసిద్ధి చెందిన భిండి జ్యువెల్లర్స్ కు కాలిఫోర్నియా, అట్లాంటాలో శాఖలు ఉన్నాయి.