Manikonda Drugs Case : మణికొండ డ్రగ్స్ కేసు.. పట్టుబడిన వారిలో వ్యాపారులు, ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు
Manikonda Drugs Case : మణికొండలోని కేవ్ పబ్ లో టీజీ న్యాబ్ అధికారులు, రాయదుర్గం ఎస్ వోటీ పోలీసులు సోదాలు నిర్వహించి 55 మందిని అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలను మాదాపూర్ డీసీపీ వినిత్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కేవ్ పబ్ లో పట్టుబడిన వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తే డీజే నిర్వాహకుడు ఆయూబ్ తో పాటు మరో 24 మంది డ్రగ్స్, గంజాయి తీసుకున్నట్టు తేలిందన్నారు. మత్తు పదార్థాలు తీసుకన్నవారిలో ఎక్కువ మంది విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు ఉన్నారని వివరించారు.
పట్టుబడినవారిలో సినీ, వ్యాపార ప్రముఖులు, విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రముఖ ఫొటోగ్రాఫర్ మహేశ్ చంద్ర, మ్యూజీషియన్ అబ్దుల్లా అయూబ్, యానిమేటర్ చింతం పూజిత్, వీఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ పోతురి వంశీకృష్ణ పట్టుబడినట్లుగా పోలీసులు వెల్లడించారు. అలాగే అమెజాన్, టీసీఎస్ ఉద్యోగులు సైతం ఉన్నట్లు పోలీసుల పేర్కొన్నారు. ఎవరెస్ట్ మసాల వ్యాపారవేత్త మహేశ్ గిరిధర్ తో పాటు మరికొందరు బిజినెస్ మ్యాన్లు షఫీ, రఝా సైతం డ్రగ్స్ తీసుకుంటు పోలీసులకు చిక్కారు. అలాగే ప్రముఖ అకౌంటెంట్లు ఆదన్ బారి, నవాజుద్దీన్, సివిల్ ఇంజనీర్ రోహిత్ వర్మతో పాటు మరో కాలేజీ విద్యార్థి పట్టుబడినట్లు పోలీసుల వెల్లడించారు.