Manchu Manoj:పండంటి బిడ్డకు జన్మనివ్వనున్న మనోజ్-మౌనిక
Manchu Manoj:మంచు మనోజ్ తండ్రి కాబోతున్నాడు. మనోజ్- మౌనిక దంపతులు తొలి సంతానం గురించిన శుభవార్తను అందించారు. తాజాగా మనోజ్ ఇన్ స్టాగ్రమ్ లో తన దివంగత అత్తగారు శోభా నాగిరెడ్డి ఫోటోని షేర్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ అసలు విషయం చెప్పాడు. తాను, మౌనిక త్వరలో అమ్మా నాన్నలు కాబోతున్నామని తెలిపాడు. మౌనిక తల్లిగారైన శోభా నాగిరెడ్డి, తండ్రిగారైన భూమా నాగి రెడ్డి దివంగతులు అన్న సంగతి తెలిసిందే. వారిని తలచుకుని ఈ సందర్భంగా మనోజ్ ప్రేమను కురిపించారు. వారికి ఇది తాము ఇచ్చే కానుక అని అన్నారు.
సోషల్ మీడియాలో మనోజ్ వ్యాఖ్యానం ఇలా ఉంది. ప్రియమైన అత్తమ్మ పుట్టినరోజును స్మరిస్తూ సత్కరిస్తున్నాను. మీ ప్రేమపూర్వక ఆలింగనంలో సంతోషకరమైన వార్తలను పంచుకుని ఓదార్పును పొందుతున్నాము. మామ భూమా నాగిరెడ్డి గారు తాత అవుతున్నారు. చిన్న ధైరవ్ (మౌనిక కుమారుడు) అన్న కావడంపై థ్రిల్లింగ్ గా ఉన్నాడు. మా కుటుంబాన్ని అంతులేని ప్రేమతో మీరు రక్షిస్తూ ఉంటారని.. నిజంగా కృతజ్ఞులమై ఉంటాము. మా అమ్మ శ్రీ నిర్మల గారు మా నాన్నగారు శ్రీ మోహన్ బాబు గారి ఆశీస్సులతో మా కుటుంబంలోని అన్ని వైపులా ప్రేమ మద్దతుతో ఆదరణ పొందుతున్నాము“ అని రాసారు. స్వర్గంలో దివంగతులైన అత్తా మామలు ఆనందంగా ధీవించాలని మనోజ్ కోరారు.
మంచు మనోజ్ – మౌనిక చాలా కాలంగా స్నేహితులు. స్నేహం ప్రేమగా మారింది. తర్వాత ఈ జంట 2022 గణేష్ చతుర్థి సందర్భంగా తొలిసారి కలిసి బహిరంగంగా కనిపించారు. 2023 మార్చిలో పెళ్లాడారు. ఇప్పుడు ఈ జంట పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. తొలి సంతానం గురించి మనోజ్ అధికారికంగా ఇన్ స్టాలో ప్రకటించడంతో అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.