Malla Reddy : మల్లారెడ్డి.. మళ్లీ వేశాడు

Malla Reddy

Malla Reddy

Malla Reddy : ఇప్పుడున్న తెలంగాణ పొలిటీషియన్స్ లో ఠక్కున గుర్తుకు వచ్చే వారు ఎవరన్నా ఉన్నారంటే అది చామకూర మల్లారెడ్డి మాత్రమే. ఆయన ఏది మాట్లాడినా ఆశ్చర్యం అనిపిస్తుంది. తెలిసి అంటాడా? లేక తెలియక అంటాడా? అనేది పక్కన పెడితే సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటాడు.

గతంలో మల్లన్న ‘పాలమ్మిన’ డైలాగ్ గుర్తుండే ఉంటుంది కదా.. ఆ డైలాగ్ తో విపరీతంగా ఫేమస్ అయ్యాడు. పొలిటీషియన్స్ కూడా ఆయన మాటలు ఇమిటేట్ చేసేంత ఫేమస్ అయ్యాడు. ఇవన్నీ పక్కన పెడితే మల్లారెడ్డి పొలిటీషియన్ గా ప్రజల్లో ఉన్న వ్యక్తే. కానీ ఏ పార్టీలోకి ఎప్పుడు జంప్ చేస్తాడో తెలియదు. తెలుగు దేశంలో ఉంటూనే ఉన్న పలంగా కాంగ్రెస్ లోకి వచ్చాడు. అక్కడ కొనసాగుతూ ఉండగానే బీఆర్ఎస్ (టీఆర్ఎస్)లోకి వచ్చాడు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్లడం ఆయనకు పరిపాటిగా మారింది.

ఇప్పుడు బీఆర్ఎస్ ప్రతిపక్షానికి పరిమితం కావడంతో ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలని పావులు కదుపుతున్నాడు. అప్పట్లో మల్లారెడ్డికి ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డికి పెద్ద ఎత్తున వార్ జరిగింది. కానీ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు కదా.. ఆ నానుడిని ఉపయోగించుకొని ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇందు కోసం రేవంత్ రెడ్డిని ప్రసన్నం చేసుకునేందుకు పొగడ్తల వర్షం కురిపిస్తున్నాడు. కర్ణాటక డిప్యూటీ సీఎం యాడ్యురప్పతో రాయబారం నడుపుతున్నాడు.

ఇదంతా పక్కన పెడితే తాను రేవంత్ రెడ్డిపై కొన్ని వ్యాఖ్యలు చేశాడు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రేవంత్ సీఎం అవుతాడని తాను ఎప్పుడో చెప్పానన్నాడు. అదెప్పుడో కూడా చెప్పాడు. 2014 బొల్లారంలోని తోట ముత్యాలమ్మ ఆలయంలో అప్పుడు బతికి ఉన్న ఎమ్మెల్యే సాయన్న ఇచ్చిన విందుకు తాను వెళ్లానని ఆ విందుకు రేవంత్ రెడ్డి కూడా వచ్చాడని ఆ సందర్భంలో తాను స్వయంగా రేవంత్‌ తో ఈ విషయం చెప్పినట్లు తెలిపారు.

అప్పటి వీడియోను కంటోన్మెంట్‌ జయానగర్‌ కాలనీలోని తన కార్యాలయంలో శనివారం (మార్చి 16) ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపాడు. మల్లారెడ్డి మాట్లాడుతూ.. అయితే, తాను కాంగ్రెస్ లోకి వెళ్తానని వస్తున్న వార్తలు నిజం కాదన్నారు. గతంలో రేవంత్‌ పై చేసిన వ్యాఖ్యలు రాజకీయ కోణంలోనే చూడాలన్నారు. తాము టీడీపీలో ఉన్న సమయంలో ఎంతో స్నేహంగా మెలిగేవారమని గుర్తు చేసుకున్నారు.  

TAGS