Maldives President : మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు పీఠం ఎక్కినప్పటి నుంచి భారత్ ను కవ్విస్తూనే ఉన్నాడు. ఆయన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
భారత్ లో కొత్త సర్కార్ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో పొరుగున ఉన్న మాల్దీవులకు ఆహ్వానం అందింది. దీంతో ఆయన ఢిల్లీకి వచ్చారు. నేతలను అభినందించడం, అధికారులకు కరచాలనం చేయడం లాంటివి చేస్తూనే అక్కడ వారి దేశం మాల్దీవుల పార్లమెంట్ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. మాల్దీవుల గత ప్రభుత్వం భారత్ తో చేసుకున్న ఒప్పందాలను సమీక్షించే ఉద్దేశంతో తీసుకువచ్చారు. ఇది రెండు దేశాల సంబంధాలను దిగజారుస్తుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది.
‘హైడ్రోగ్రాఫిక్ సర్వే’, ‘ఉతురు థిలా ఫాల్హు డాక్‌యార్డ్ ప్రాజెక్ట్’ నిర్మాణం, మానవతాసాయం, సహాయక చర్యల కోసం మాల్దీవుల సైన్యానికి ఇచ్చిన డార్నియర్ విమానం వంటి వాటి కోసం ఇరుదేశాల మధ్య గత ప్రభుత్వంలో కుదిరిన ఒప్పందాలను ఆ దేశ పార్లమెంటరీ కమిటీ పరిశీలిస్తుంది. భారత్ తో చేసుకున్న ఒప్పందాలు మాల్దీవుల సార్వభౌమత్వానికి ముప్పు కలిగిస్తాయని ఆరోపించడం గమనార్హం. దీనిపై విదేశాంగమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జై శంకర్‌ను పాత్రికేయులు ప్రశ్నించారు. ‘మొయిజ్జుతో నేను సమావేశమయ్యాను. ఆయన ప్రధాని మోడీతో కూడా భేటీ అయ్యారు. విదేశాంగ విధానంలో చర్చల ద్వారా ముందుకు వెళ్లాలనుకుంటున్నాను’ అని చెప్పారు.
చైనా అనుకూలుడైన మొయిజ్జు అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి భారత్‌తో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. గత అధ్యక్షులుగా భారత్‌లో కాకుండా.. తొలి పర్యటన తుర్కియే, ఆ తర్వాత చైనాలో చేశారు. దీంతో పాటు భారత్ బలగాలు మాల్దీవులను విడిచిపోవాలని, అందుకు గడువు కూడా పెట్టాడు. దేశంలో పరిశ్రమలు, నిర్మాణ ప్రాజెక్టుల కోసం చైనా వైపు మొగ్గు చూపుతున్నారు.
ఇవి చేస్తూనే భారత్‌తో సన్నిహిత సంబంధాలు కావాలని మోడీతో కలిసి పని చేసేందుకు ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు సానుకూలంగా సాగుతున్నాయనే సందేశం ఈ పర్యటనతో నిరూపితం అవుతుందని వ్యాఖ్యానించారు. మాల్దీవుల పార్లమెంటరీ కమిటీ దర్యాప్తు చూస్తుంటే.. ఆయన రెండు నాలుకల ధోరణి తేటతెల్లం అవుతోంది.