Chiranjeevi : పవన్ కల్యాణ్ ను గెలిపించండి.. మీకోసం వాడి జీవితాన్నేఅంకితం చేస్తాడు : చిరంజీవి
Chiranjeevi : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిపించాలని మెగా స్టార్ చిరంజీవి ప్రజలను కోరారు. ఈ సారి జనసేన తరఫున తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసిన పవన్ కల్యాణ్ రెండు చోట్ల ఓడిపోయారు. దీంతో జనసేన అభిమానులు, కార్యకర్తలు, పవన్ కల్యాణ్ కూడా తీవ్ర నిరాశలో కూరుకుపోయారు.
అందుకే ఈ సారి ఎలాగైనా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలనే పక్కా ప్రణాళికతో టీడీపీతో పొత్తు పెట్టుకుని బీజేపీని కలుపుకుని సార్వత్రిక ఎన్నికల రణరంగంలోకి దిగారు. ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ తరఫున వాళ్లు అందరూ ఓటేస్తే పవన్ గెలవడం ఈజీనే. పవన్ కల్యాణ్ కు మద్దతుగా ఇప్పటికే సినీ ప్రముఖులు తెగ ప్రచారం చేస్తున్నారు. ఈసారి పవన్ తప్పకుండా గెలుస్తాడని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
అయితే పవన్ కల్యాణ్ అన్న చిరంజీవి పవన్ ను గెలిపించాలని ఎమోషనల్ పోస్టు చేశారు. తల్లి కడుపున పవన్ కల్యాణ్ చివరగా పుట్టినా జనం కోసం సేవ చేయడంలో తపించే వ్యక్తి అని అన్నారు. అలాంటి వ్యక్తిని కచ్చితంగా గెలిపించాలని విన్నవించుకున్నారు. చిరంజీవి 2009 లో ప్రజారాజ్యం పార్టీ పెట్టి తిరుపతి నుంచి ఎమ్మెల్యే గా గెలిచి ఆ తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా పనిచేసిన చిరంజీవి రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు మద్దతుగా నిలిచి తెలంగాణకు దూరమయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంను ప్రకటించడంతో హస్తం పార్టీకి దూరంగా ఉంటున్నారు. చిరంజీవికి రాజకీయాలు అచ్చి రాలేవని చాలా మంది రాజకీయ నిపుణులు గతంలో అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ తమ్ముడు కోసం చిరంజీవి ప్రజలను గెలిపించాలని కోరడం చూస్తుంటే పవన్ కు సమాజం మీద ఉన్న ప్రేమ, సేవ చేయాలనే తపన గురించి తెలిసిపోతుంది. మరి ఈసారి పిఠాపురం ప్రజల మనసు గెలుచుకుని అసెంబ్లీలో పవన్ కల్యాణ్ అడుగు పెడతాడో లేదో మరి కొన్ని రోజుల్లో తేలిపోనుంది.