JAISW News Telugu

Makara Sankranthi : మకర సంక్రమణం‌ పండుగ

Makara Sankranthi : సూర్యుడు నెలకో రాశిలోకి సంక్రమణం చేస్తూ ఉంటాడు. నిజానికి ఈ నెలవారి సూర్య సంక్రమణం‌ అనేది భూభ్రమణం‌వల్ల జరుగుతుంది. సూర్య గమనంవల్ల కాదు. సూర్య ఉదయ, అస్తమనాలు కూడా భూభ్రమణంవల్లే జరుగుతాయి‌, సూర్యభ్రమణంవల్ల కాదు. అయితే సూర్యోదయం, సూర్యాస్తమనం అనే వ్యవహారంలో పరిగణించబడుతున్నాయి. ఖగోళ శాస్త్రపరంగా కూడా సూర్య ఉదయ,‌‌ అస్తమనాలుగానే తీసుకోబడుతున్నాయి. సూర్యోదయ సమయం అనే,‌ సూర్యాస్తమన‌ సమయం అనే మనకు తెలియజేయబడుతున్నాయి. రాశులలోకి (భూబ్రమణం వల్ల) జరిగే సూర్య సంక్రమణాన్ని ప్రిసెషన్ (precession) అంటారు.

సూర్యుడు‌ మకర రాశిలోకి సంక్రమణం‌ చెయ్యడం మకర సంక్రాంతి పండుగగా పరిగణించబడుతోంది మనదేశంలో.‌ ఇతర రాశులలో సూర్య సంక్రమణం జరుగుతున్నప్పుడు‌ లేని విశేషం ఈ‌ మకర సంక్రమణంలో ఏమిటి?

మకర రాశికి అధిపతి శని. ఈ శని‌ వ్యవసాయానికి దేవుడు. చేసుకున్న‌ వ్యవసాయానికి ఫలితంగా పంట చేతికొస్తుంది‌ కాబట్టి‌ శని దేవుడి సంబరం లేదా పండుగగా సూర్యుడి మకర సంక్రమణాన్ని జరుపుకుంటున్నారు. తెలివిడి లేకుండా హిందూ పండగల్ని మాత్రమే విమర్శిస్తూండేవాళ్లు మకర సంక్రమణం ఇలా ఒక పండగ అయిందని తెలుసుకోవాలి. అర్థం పర్థం‌ లేకుండా జరుపుకోబడుతున్న క్రిస్మస్, జాన్యూఅరి 1 వంటిది కాదు ఆ మకర సంక్రాంతి పండుగ.

ధనుర్మాసం‌గా జరుపుకుంటున్న కాలాన్ని సేటనెయ్ లిఅ(saturnalia)గా గ్రీక్, రోమ్ లలో జరుపుకునే వారు. సేటనెయ్ లిఅ(saturnalia) అంటే festival of saturn. జాన్యూఅరి (జనవరి) రెండో వారం నుంచి మాచ్ (March) రెండో వారం వఱకూ వ్యవసాయానికి రాజైన శనికి సంబంధించిన‌ కాలం కాబట్టి ఆ కాలం రావడానికి ముందుగా ఈ సంబరాల్ని జరుపుకోవడం. మన ధనుర్మాస ఉత్సవాలకూ కారణం ఇదే.

కొన్నేళ్ల క్రితం వఱకూ జాన్యుఅరి 14వ తేదిన జరుగుతూండే మకర సంక్రమణం ఇటీవల జాన్యుఅరి 15న జరుగుతోంది. ఈ సంవత్సరమూ జాన్యుఅరి 15న మకర సంక్రమణం.

ఉత్తరాయణం డిసెంబర్ 22, భారతదేశ కాలమానం పొద్దున 8.57కు మొదలౌపోయింది.

కొందఱు అనుకుంటున్నట్లుగానూ, అంటున్నట్లుగానూ, కొన్ని పంచాంగాలు, కాలండర్‌లు సూచిస్తున్నట్టుగానూ ఉత్తరాయణ పుణ్యకాలమూ, మకర సంక్రమణమూ ఒకే రోజున జరగవు‌‌. ఈ రెండూ వేర్వేఱు రోజుల్లో జరుగుతాయి.

డిసెంబర్ 22న ఉత్తరాయణం మొదలవుతుంది. ఆ రోజు భూమి తన అక్షాన్ని ఉత్తరం వైపుకు మార్చుకుంటుంది. జాన్యూఅరి (జనవరి)లో జరిగేది మకర సంక్రమణం మాత్రమే. అంటే సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించడం.

ఉన్న 12 రాశుల్లోకీ నెలనెలా సూర్యుడు ప్రవేశిస్తూనే ఉంటాడు. సంక్రమణం అంటే దాటడం. సూర్యుడు ఒక రాశినుంచి మఱొక రాశికి దాటడం సూర్య సంక్రమణం అవుతుంది.

ఈ వ్యావహారిక శకం లేదా సామాన్య శకం (Common Era) 3వ శతాబ్ది (281వ సంవత్సరం)లో మకర సంక్రమణం డిసెంబర్ 22న ఉత్తరాయణంతో ముడిపడి జరిగింది. భూ అక్షం 70 లేదా 72 సంవత్సరాలకు ఒక్క డిగ్రీ పక్కకు జరిగిపోతూ ఉంటుంది. ఆ కారణంవల్ల మకర సంక్రమణం ముందుకు జరుగుతూ, జరుగుతూ వచ్చి ఇటీవలి కాలంలో జాన్యూఅరి 14, 15లలో జరుగుతోంది. కొన్నేళ్లకు ముందు లేదా సమీప గతంలో జాన్యూఅరి 13న జరిగేది‌‌. మకర సంక్రమణమూ, ఉత్తరాయణ పుణ్యకాలమూ ఒకటిగా ఇప్పుడు జరగడం లేదు.

ఉత్తరాయణం అన్నది భూభ్రమణానికి సంబంధించింది‌. మకరసంక్రమణం సూర్యుడి గమనానికి సంబంధించింది. భూమి తన అక్షాన్ని మార్చుకోవడాన్ని “Perihelion” అంటారు. ఉత్తరాయణ పుణ్యకాలం వేఱు, మకర సంక్రమణం వేఱు. (నెట్లో winter solistice అని సెర్చ్ చేసినా ఈ విషయం తెలుస్తుంది).

ఒప్పులకు మనం మాలిమి అవాలి. ఒప్పులతో ఒప్పారుతూ మనం పండుగల్ని జరుపుకుందాం.

Rochishman

– రోచిష్మాన్
9444012279
అంతర్జాతీయ కవి, విశ్లేషకుడు, కాలమిస్ట్, జెమలజిస్ట్

Exit mobile version