Yogendra Yadav : ఏపీలో మే 13న ఇటు అసెంబ్లీ, అటు పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈసారి జరిగిన ఎన్నికల పోరు రసవత్తరంగా ఉంది. జూన్ 4న ఏ రాజకీయపార్టీ అధికారంలోకి రాబోతుందంటూ రాష్ట్రంలో ఏ నలుగురు కలిసినా ఇదే చర్చ నడుస్తోంది. పార్టీలన్నీ కూడా అధికారం ఎలాగైనా ఈ సారి చేజిక్కించుకోవాలని సర్వశక్తులు ఒడ్డి పోరాడాయి. ఈ సారి గెలవబోవు పార్టీలపై భారీగా బెట్టింగ్ లు కూడా జరుగుతున్నాయి. జూన్ 4 జరిగే ఓట్ల లెక్కింపులో ఏ పార్టీ గెలుస్తుందన్న దానిపై ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ కూడా కొనసాగుతున్నాయి.. అయితే ఆలోపే మన రాష్ట్రంతో పాటు జాతీయ స్థాయిలోనూ ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ఆసక్తి రేపుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఈ సారి ఏపీలో ఎవరికి మెజార్టీ లోక్ సభ సీట్లు దక్కనున్నాయనే అంశంపై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు అయిన యోగీంద్ర యాదవ్ తన అంచనాలను వెల్లడించారు. ఈసారి జాతీయ స్థాయిలో బీజేపీకి అధికారం చేపట్టేందుకు అవసరమైన మెజార్టీ రావడం లేదని జోస్యం చెప్పారు. ఈ విషయంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(పీకే) అంచనాలు తప్పన్నారు. ఎన్నికల విశ్లేషణల్లో పేరున్న యోగీంద్ర యాదవ్ ఏపీలో ఏం జరగబోతుందో చెప్పారు.
ఏపీలోని 25 లోక్ సభ సీట్లకు జరిగిన ఎన్నికల్లో దాదాపు 15 సీట్లు ఎన్డీయే కూటమి కైవసం చేసుకునే అవకాశం ఉందని యోగీంద్ర యాదవ్ తెలిపారు. కేంద్రంలో ఒంటరిగా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ సాధించలేకపోతున్న బీజేపీ.. మిత్రపక్షాలైన టీడీపీ, జనసేన వంటి వారిపై ఆధారపడాల్సి వస్తుందంటూ తేల్చి చెప్పారు. అంతే కాదు ఏపీలో బీజేపీకి మూడు ఎంపీ సీట్లు, అలాగే దాని మిత్రపక్షాలైన టీడీపీ, జనసేనకు కలిపి 12 ఎంపీ సీట్లు దక్కే అవకాశం ఉందన్నారు. యోగింద్ర యాదవ్ జోస్యం.. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చలకు దారితీసింది.