Majlis Party : రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తునే పార్టీ రాష్ట్ర అధినేతగా దూకుడుగా ముందుకెళ్తున్నారు. ప్రభుత్వ మనుగడపై పదే పదే ఆరోపణలు చేస్తున్నవారికి రేవంత్ మాటలతోనే కాదు చేతలతోనూ కౌంటర్ ఇస్తున్నారు. తన ప్రభుత్వానికి, ముఖ్యంగా తనకు ముప్పు ఉండొచ్చనే ఆలోచనతో అలాంటివాటికి ఆదిలోనే ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా రేవంత్ ను కలుస్తుండడంతో పాటు నిన్న మజ్లిస్ నోటి వెంట కూడా తమ మద్దతు రేవంత్ రెడ్డికే అని చెప్పించగలిగారు. పాతబస్తీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎంతో పాటు అసదుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు. ఎన్నికలకు ముందు చాలా విమర్శలు చేసుకున్నా అవేవీ పట్టించుకోలేదు. రేవంత్ రెడ్డి ఐదేళ్లు అధికారంలో ఉంటారని వేదిక మీద నుంచే ఓవైసీ భరోసా ఇచ్చారు.
నిజానికి ఓవైసీ స్ట్రాటజీ..ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అప్రకటిత మిత్రపక్షంగా వ్యవహరిస్తారు. బీఆర్ఎస్ తో చాలా కాలం సన్నిహితంగా ఉన్నారు. అయితే అధికారం పోయిన తర్వాత మాత్రం కేసీఆర్ ను ఓవైసీ పట్టించుకోవడం లేదు. ఇక కలిసి పనిచేసే చాన్స్ లేదు. గతంలో కలిసి పనిచేసేవారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల ప్రయత్నాలకు ఓవైసీ తన వంతు సాయం చేశారు. కానీ ఆయన పార్టీతో పొత్తులు పెట్టుకోలేదు. అంతా తెర వెనుక సాయమే.
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మెరుగైన స్థానాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పద్నాలుగు స్థానాలు వస్తాయని రేవంత్ నమ్మకంగా ఉన్నారు. అన్ని సీట్లు వస్తే ఆయన కచ్చితంగా తన ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకుంటారు. పది సీట్లు వచ్చినా విశ్వరూపం చూపిస్తారు. లోక్ సభ ఎన్నికల్లో ఎంపీ సీట్లు ఎక్కువగా గెల్చుకున్నా..ఇప్పటికిప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ సిద్ధపడకపోవచ్చు. రేవంత్ ప్రభుత్వం ఉండకూడదని బీఆర్ఎస్ మాత్రం గట్టిగా కోరుకుంటోంది. గత ప్రభుత్వంలో అనేక అవకతవకలు వేగంగా వెలుగులోకి వస్తుండడమే దీనికి కారణం. మొత్తానికైతే తెలంగాణ రాజకీయాలు మున్ముందు మరింత రసవత్తరం కావడం మాత్రం ఖాయం.