Main Atal Hoon:దివంగత ప్రధాని, భాజపా నాయకుడు వాజ్ పేయి జీవితం ఆధారంగా మై అటల్ హూన్ అనే బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పంకజ్ త్రిపాఠి టైటిల్ పాత్రధారి.రవి జాదవ్ దర్శకత్వం వహించిన మైన్ అటల్ హూన్ చిత్రం 19 జనవరి 2024న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని భానుశాలి స్టూడియోస్ లిమిటెడ్ – లెజెండ్ స్టూడియోస్ సమర్పణలో వినోద్ భానుషాలి, సందీప్ సింగ్, సామ్ ఖాన్, కమలేష్ భానుశాలి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇంతకుముందే మైన్ అటల్ హూన్ ట్రైలర్ విడుదల కాగా అద్భుత స్పందన వచ్చింది. చరిత్ర మరువని ఒక లెజెండరీ రాజకీయ నాయకుడు దివంగత అటల్ బిహారీ వాజ్ పేయి వ్యక్తిత్వం, అతడి రాజకీయ చతురత, విద్యార్థి రాజకీయాలు, నాయకత్వంలో ధీరత్వం వగైరా అంశాలను ఆవిష్కరించారు. వాజ్ పేయి హాస్య చతురత, గుణగణాలను తెరపై ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంది. ముఖ్యంగా వాజ్ పేయి విద్యార్థిగా ఉన్నప్పుడు రాజకీయాల్లో ఎంతో ధీశాలిగా ఉన్నారు. ఆయన కాలేజీ రోజుల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) లో చేరాక ఎన్నో సవాళ్లను కూడా ఎదుర్కొన్నారు.
ఆయన కాలేజ్ విద్యార్థిగా రాజకీయాల్లో ఉన్నప్పుడు యూత్ వింగ్ లో పని చేసి ఆందోళనల్లో పాల్గొన్నారు. జైలు జీవితం కూడా గడిపారు. రాజకీయాలు ముళ్ల బాట అని తెలిసి అటుపై థియేటర్ డ్రామాల్లోను నటించారు. ఒక లెజెండరీ నాయకుడి స్ఫూర్తివంతమైన జీవితాన్ని వెండితెరపైకి తీసుకొస్తున్నామని మేకర్స్ ఇంతకుముందు ప్రకటించారు. తాజాగా వాజ్ పేయి 99వ జయంతిని పురస్కరించుకుని మై అటల్ హూన్ నుంచి దేశ్ ఫేలే అంటూ సాగే తొలి పాటను విడుదల చేసారు. అటల్ జీ జీవన శైలి, రాజకీయాలను ఆవిష్కరించే పాట ఇది. జుబిన్ నౌటియాల్ పాడారు. సాహిత్యాన్ని మనోజ్ ముంతాషిర్ రాశారు. పాయల్ దేవ్ స్వరపరిచారు.