Main Atal Hoon trailer:రాజకీయాల్లో సవాళ్లు, ప్రతిసవాళ్లు, ఎదురొడ్డి పోరాడే నైజం, నాయకుడిగా విదేశాలతో సత్సంబంధాలు, నిరూపించే నాయకత్వం ఇవన్నీ చాలా కీలకం. ఇలాంటి అన్ని గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తిత్వం అటల్ బిహారీ వాజ్ పేయిని ప్రత్యేకమైన నాయకుడిగా నిలబెట్టాయి. దివంగత ప్రధాని, భాజపా నాయకుడు వాజ్ పేయి సాహసోపేతమైన నిర్ణయాలు, యువనాయకుడిగా ఆయన ప్రయాణం, విదేశాలతో సత్సంబంధాలు నెరిపిన తీరు, కష్టనష్టాల్లో ఆయన డెసిషన్స్ ఇలా ప్రతిదీ ఉత్కంఠ కలిగించేవే.
అందుకే ఆయన జీవితంలో విశేషాలన్నిటినీ వెండితెరపైకి తెచ్చే ప్రయత్నం సాగుతోంది. మై అటల్ హూన్ అనేది ఈ సినిమా టైటిల్. పంకజ్ త్రిపాఠి వాజ్ పేయి పాత్రలో నటించారు. తాజాగా రిలీజైన ట్రైలర్ ఆద్యంతం వాజ్ పేయి నాయకత్వ నైపుణ్యాన్ని, సాహసోపేతమైన నిర్ణయాలను, త్యాగాలను ఆవిష్కరించింది. యువనాయకుడిగా ఆయన అసాధారణ ప్రయాణం, అటుపై దేశ ప్రధానిగా, ప్రతిపక్ష నాయకుడిగా ఇలా అన్ని కోణాల్లో ఆయన గురించి ఈ ట్రైలర్ ఆవిష్కరించింది. ముఖ్యంగా ట్రైలర్ లో వాజ్ పేయి హాస్యచతురత, నిర్ణయాల్లో బ్రిలియన్సీ ఆకట్టుకుంటాయి.
రవి జాదవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రిషి విర్మణి- రవి జాదవ్ రచించారు. ఈ చిత్రాన్ని భానుశాలి స్టూడియోస్ లిమిటెడ్ – లెజెండ్ స్టూడియోస్ నిర్మాణంలో వినోద్ భానుషాలి, సందీప్ సింగ్ , కమలేష్ భానుశాలి నిర్మించారు. ఈ చిత్రం 2024 జనవరి 19న పెద్ద స్క్రీన్‌లపైకి రానుంది. అటల్ బిహారీ వాజ్‌పేయి బాల్యం, రాజకీయ జీవితం, మార్పు తీసుకురావడానికి ఆయన చేసిన అంకితభావం వంటి తొలినాళ్లను ఈ ట్రైలర్ లో చూపించడంపై పంకజ్ త్రిపాఠి మాట్లాడుతూ, `సినిమా కంటే, శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయిగా నటించిన ప్రయాణం నిజంగా నా హృదయానికి దగ్గరగా ఉంది. అతని స్ఫూర్తిదాయకమైన కథను ప్రపంచానికి అందించడం మాకు గౌరవం. అటల్ జీ వారసత్వాన్ని పెద్ద తెరపైకి తీసుకురావడానికి మా ప్రయత్నాలను ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను` అన్నారు.
దర్శకుడు రవి జాదవ్ మాట్లాడుతూ-`చిన్నప్పటి నుండి నేను శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి స్పూర్తిదాయకమైన ప్రయాణాన్ని మన దేశానికి ఆయన చేసిన సహకారాన్ని అనుసరించాను. మన దేశం గొప్ప నాయకుడి కథను వివరించడానికి నాకు అవకాశం, మద్దతు లభించినందుకు నేను చాలా కృతజ్ఞుడను. ప్రపంచం అతడి అద్భుతమైన ప్రయాణాన్ని చూసే వరకు వేచి ఉండలేను`అని అన్నారు.
ఈ కథను వెండితెరపైకి తీసుకురావడం గురించి నిర్మాత వినోద్ భానుషాలి మాట్లాడుతూ, `కవి, రాజనీతిజ్ఞుడు, రాజకీయవేత్త కోణాలను మించి అతడి జీవితకథను ఈ చిత్రం చూపుతుంది. మెయిన్ అటల్ హూన్ వాజ్ పేయి పోరాటం, అతని ఎదుగుదల, పతనాలు అన్నిటినీ తెరపై చూపాం. ఆయన కథను రీల్‌లోకి తీసుకురావడానికి మాకు ఈ అవకాశం లభించినందుకు దీనిని ఆశీర్వాదంగా భావిస్తాం` అని అన్నారు.