JAISW News Telugu

Anand Mahindra : సర్ఫరాజ్ తండ్రికి మహీంద్రా భారీ గిఫ్ట్..ఎంకరేజ్ చేయడంలో ఆనంద్ స్టైలే వేరు!

Anand Mahindra

Anand Mahindra

Anand Mahindra : ఆనంద్ మహీంద్రా భారీ పారిశ్రామికవేత్తగానే కాదు..సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. తన వీడియోల ద్వారా దేశంలోని యూత్ ను మోటివేట్ చేస్తుంటారు. సోషల్ మీడియాలో ఆయన పెట్టే పోస్టులు, వీడియాల కోసం ఎంతో మంది వేచిచూస్తుంటారు. ఆయనలోని క్రియేటివిటీ, ఆధునిక ఆలోచనలకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఆయన పెట్టే పోస్టుల్లో దేశభక్తి, మోటివేషనల్ ఎక్కువ ఉంటాయి. దేశంలో ప్రతిభ ఎక్కడ ఉన్నా ఆయన గుర్తిస్తారు. అభినందిస్తుంటారు. అప్పుడప్పుడు వారికి గిఫ్ట్ లు కూడా ఇస్తుంటారు.

తాజాగా టీమిండియా యువసంచలనం సర్ఫరాజ్ ఖాన్ తండ్రి నౌషద్  ఖాన్ పై ఆనంద్ మహీంద్రా ప్రశంసల జల్లు కురిపించారు. ఆయన స్ఫూర్తిదాయకమైన తండ్రి అంటూ కొనియాడారు. ఆయనను పొగడడమే కాదు ఓ భారీ గిఫ్ట్ ను సైతం అందిస్తానని చెప్పారు. ఇంతకీ అదేంటో మీకు చెప్పలేదు..అదేనండి వారి కంపెనీకే చెందిన ‘థార్’ కారును అందిస్తానని ఎక్స్ వేదికగా ప్రకటించారు.

ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ సందర్భంగా సర్ఫరాజ్ కు భారత్ టీంలో అరంగేట్రానికి అవకాశం వచ్చింది. తొలి మ్యాచ్ లోనే సర్ఫరాజ్ విధ్వంసర బ్యాటింగ్ తో హాఫ్ సెంచరీ చేసి సత్తా చాటాడు. అనూహ్యంగా ఔట్ కాకపోతే స్కోర్ బోర్డును పరుగులెత్తించేవాడే. అయినా కూడా 48 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేసి టెస్టుల్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ సాధించిన భారత ప్లేయర్ గా పాండ్యా సరసన నిలిచాడు.

గత మూడేళ్లుగా దేశవాళీ క్రికెట్ లో పరుగుల వరద పారిస్తున్న సర్ఫరాజ్ కు సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీమిండియా నుంచి పిలుపు వచ్చింది. దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే చేతుల మీదుగా అరంగేట్ర క్యాప్ అందుకున్నాడు. ఈ సమయంలో అక్కడే ఉన్న అతడి తండ్రి నౌషద్  ఖాన్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఉబికి వస్తున్న దు:ఖాన్ని ఆపుకోలేక కన్నీటి పర్యాంతమయ్యాడు. కొడుకు తొలి కోచ్ గా పాఠాలు నేర్పిన నౌషద్ ఖాన్ ..అతడి కెరీర్ కోసం ఎంతో కష్టపడ్డాడు. సర్ఫరాజ్ కోసం అండగా నిలిచాడు.

ఈక్రమంలోనే అరంగేట్ర క్యాప్ అందుకోగానే సర్ఫరాజ్.. దాన్ని తీసుకుని తండ్రి చేతిలో పెట్టాడు. ఈ సన్నివేశాలన్నీ నెట్టింట వైరల్ గా మారాయి. ఈక్రమంలో సర్ఫరాజ్ కంటే అతడి తండ్రిని నౌషద్ ను ఆనంద్ మహీంద్రా అభినందించారు. అతడికి థార్ కారును ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు.

‘‘అవకాశాలు రాలేదని సహనం కోల్పోవద్దు.. ధైర్యంగా ఉండాలి. కఠోర శ్రమ, తెగువ, ఓర్పు..ఇవే విజయానికి బాటలు. పిల్లల్లో స్ఫూర్తిని కలిగించేందుకు ఇంతకంటే మెరుగైన లక్షణాలు ఇంకేం ఉంటాయి? తన పిల్లలకు ఓ స్ఫూర్తిదాయక తండ్రిగా ఉన్న నౌషద్ కు థార్ కారు గిఫ్ట్ గా ఇద్దామని అనుకుంటున్నా. మా కానుకను అందుకునేందుకు ఆయన అంగీకరిస్తే ఎంతో సంతోషిస్తాం..మాకు దక్కిన గౌరవంగా భావిస్తాం’’ అని మహీంద్రా ట్వీట్ చేశారు.

Exit mobile version