Maharashtra elections : మహారాష్ట్ర ఎన్నికలు.. ఎన్సీపీ అభ్యర్థుల మొదటి జాబితా విడుదల

Maharashtra elections
Maharashtra elections 2024 : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ బుధవారం కీలక ప్రకటన చేసింది. ఎన్నికల వ్యూహంలో భాగంగా 38 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ఎన్సీపీ విడుదల చేసింది. బారామతి నుండి అజిత్ పవార్, యోలా నుంచి ఛగన్ భుజబల్ ను బరిలోకి దింపింది. అంబేగావ్ నుంచి దిలీప్ వల్సే-పాటిల్, కాగల్ నుంచి హసన్ ముష్రీఫ్, పార్లీ నుంచి ధనంజయ్ మొండే, దిండోరి నుంచి నరహరి ఝుర్వాల్ లను కూడా పార్టీ బరిలోకి దించింది.
మరోవైపు శివసేన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు 45 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను ఇప్పటికే విడుదల చేసింది. థానే నగరంలోని కోప్రి-పంచ్ పఖాడి నుండి సీఎం ఏక్ నాథ్ షిండేను, వారి సంబంధిత స్థానాల నుంచి అర డజనుకు పైగా క్యాబినెట్ సభ్యులను నామినేట్ చేసింది. మంగళవారం అర్ధరాత్రి విడుదల చేసిన జాబితా ప్రకారం, జూన్ 2022లో అప్పటి సీఎం ఉద్ధవ్ థాకరేపై తిరుగుబాటుకు నాయకత్వం వహించిన షిండేకు మద్దతు ఇచ్చిన దాదాపు అందరు ఎమ్మెల్యేలను అధికార పార్టీ తిరిగి నామినేట్ చేసింది.