Maharashtra : మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు.. భట్టి, ఉత్తమ్, సీతక్కకు ఏఐసీసీ కీలక బాధ్యతలు
Maharashtra and Jharkhand elections : ఈ ఏడాది చివరలో జరుగనున్న మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది. ఇటీవల జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఓటమితో ఉన్న ఏఐసీసీ మహారాష్ట్ర, జార్ఖండ్ లో మళ్లీ అలాంటి తప్పులు జరుగకుండా ముందు జాగ్రత్త పడుతోంది. అందులో భాగవగా ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే రెండు రాష్ట్రాలకు ఎన్నికల పరిశీలకులను నియమించింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం మొత్తం 11 మంది సీనియర్ నేతలను ఎన్నికల పరిశీలకులుగా ఏఐసీసీ అపాయింట్ చేసింది. మహారాష్ట్రను 5 డివిజన్లుగా విభజించి 11 మందిని పరిశీలకులుగా కాంగ్రెస్ హైకమాండ్ నియమించింది. తెలంగాణ నుంచి మంత్రులు ఉత్తమ్, సీతక్కకు ఇందులో చోటు కల్పించింది.
నార్త్ మహారాష్ట్ర డివిజన్ కు మంత్రి సీతక్క, మరాట్వాడకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎన్నికల పరిశీలకులుగా నియమించింది. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కూడా ఏఐసీసీ కీలక బాధ్యతలు అప్పగించింది. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు పరిశీలకుడిగా డిప్యూటీ సీఎం భట్టిని అపాయింట్ చేసింది. భట్టితో పాటు మరో ఇద్దరు సీనియర్ నేతలు తారిఖ్ అన్వర్, అధిర్ రంజన్ చౌదరి సైతం జార్ఖండ్ ఎన్నికల పరిశీలకులుగా నియామకమయ్యారు. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు (అక్టోబరు 15, 2024) షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది.