Shivalingam : శ్రీశైలంలో మహాద్భుతం..శివలింగాన్ని చుట్టుకున్న నాగుపాము
Shivalingam : మన దేశానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఆనాదిగా మనం పశుపక్ష్యాదులు, జంతువులు, నదులు,శిఖరాలు..ఇలా ప్రకృతిలో నెలవైన ఎన్నింటినో పూజిస్తుంటాం. ఆరాధిస్తుంటాం. ప్రకృతిని భారతీయులు పూజించినంతగా ఎవరూ పూజించలేరు. భారతీయుల ఆరాధనలో నాగుపాములకు ప్రత్యేక స్థానం ఉంటుంది. నాగ దేవతల గురించి ఎన్నెన్నో కథలు ఉన్నాయి. నాగుపాము శివుడికి ప్రతిరూపంగా పూజించుకుంటాం. నాగుల చవితి, నాగుల పంచమి..నాడు పాముల పుట్టల వద్ద ప్రత్యేక పూజలు చేస్తుంటాం. పాలు, పండ్లు, పూలు..వంటి వాటిని నైవేధ్యంగా పెడుతుంటాం. సైంటిస్టులు పాములు పాలు తాగవని, వాటికి ఏ శక్తులు లేవని చెప్పినా..మనం నమ్మకంగా వాటిని కొలుస్తూనే ఉంటాం. అలాంటి నాగుపాములు ఒక్కో సారి ఆలయాల్లో కనిపించి..భక్తులను ఆధ్యాత్మిక తన్మయత్వంలో ముంచెత్తుతాయి.
శ్రీశైల పుణ్యక్షేత్రంలో మహా అద్భుతం జరిగింది. పాతాళగంగ రోడ్డులో వజ్రమ్మ గంగమ్మ దగ్గర ఆలయం ఉంది. అక్కడ శివుడికి కూడా అభిషేకం చేస్తారు.. ఇవాళ(జూలై 16) ఉదయం.. ఆ శివలింగానికి అభిషేకం చేసేందుకు భక్తులు వచ్చారు. అక్కడ వారు ఒక గొప్ప అద్భుతాన్ని చూశారు. శివలింగాన్ని చుట్టుముట్టిన నాగుపాము కనిపించింది. నాగుపాము అటూ ఇటూ డ్యాన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇదంతా శివుని మహిమ, హర హర మహాదేవా, శంభో శంకర అంటూ భక్తులు పెద్ద ఎత్తున శివుని పూజించారు. శివనామ స్మరణతో ఆ ప్రాంతం మారుమోగింది.
ఈ విషయం గురించి తెలుసుకున్న భక్తులు పెద్ద సంఖ్యలో అక్కడకు తరలివచ్చారు. అరగంటకు పైగా నాగుపాము శివలింగం చుట్టూ చుట్టుకుందని గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని స్థానికులు తెలిపారు. శివుని మెడలో వెలసిన నాగదేవత ఈరోజు భక్తులకు దర్శనమివ్వడం విశేషం. ఆలయానికి వెళ్లిన కొందరు భక్తులు దీన్ని గమనించి.. వీడియోలు చిత్రీకరించారు. .. ఆపై సోషల్ మీడియాలో పంచుకున్నారు. శివలింగాన్ని చుట్టిన నాగుపాము వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు.. ఈ విషయం తెలుసుకున్న పలువురు స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వెళ్లి పామును దర్శించుకున్నారని స్థానికులు చెబుతున్నారు.