Mansoor Ali Khan:త్రిషపై రేప్ వ్యాఖ్యలు చేయడమే గాక, తిరిగి తనపైనే పరువు నష్టం కేసు దాఖలు చేసిన ఘనుడైన నటుడు మన్సూర్ అలీ ఖాన్‌పై మద్రాసు హైకోర్టు సోమవారం తీవ్రంగా స్పందించింది. మన్సూర్ కు బదులు త్రిష అతడిపై కేసు పెట్టాల్సిందని కోర్టు జడ్జి వ్యాఖ్యానించారు. ఇలాంటి అసహ్యకరమైన వ్యాఖ్యలు బహిరంగ ప్రదేశాల్లో చేయడం సరికాదని మన్సూర్ కి మొట్టికాయలు వేసింది హైకోర్ట్.
త్రిష, చిరంజీవి, ఖుష్బూ సోషల్ మీడియాల్లో తనను కించపరిచే వ్యాఖ్యలు చేసారంటూ మన్సూర్ అలీఖాన్ ఎదురు దావా వేసిన సంగతి తెలిసిందే. త్రిషకు మద్ధతుగా నిలిచిన చిరు, ఖుష్బూలపైనా అతడు పరువు నష్టం దాఖలు చేసాడు. పరువు నష్టం దావా విచారణ సందర్భంగా హైకోర్ట్ న్యాయమూర్తి పైవిధంగా వ్యాఖ్యానించారు. మన్సూర్ అలీఖాన్ పై త్రిష కోర్టు కేసు వేయాల్సిందని వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. పబ్లిక్ లో తరచుగా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న మన్సూర్ కి అసలు ప్రజల్లో ఎలా ఉండాలో నేర్పాలని కోర్టు అతడి తరపు న్యాయవాదికి సూచించింది. మన్సూర్ దావాను మద్రాస్ హైకోర్టు స్వీకరించడానికి నిరాకరించింది. మన్సూర్ బహిరంగ వేదికలపై స్త్రీతో ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవాలని పేర్కొంది.
ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ అయిన లియో`లో త్రిషతో `బెడ్‌రూమ్ సీన్ ఉంటుందని మన్సూర్ విలేకరుల సమావేశంలో కామెంట్ చేయడంతో ఇదంతా ప్రారంభమైంది. అతడు అప్పట్లో ఘాటైన వ్యాఖ్యలు చేసాడు. `త్రిషతో కలిసి నటిస్తున్నానని విన్నప్పుడు సినిమాలో బెడ్‌రూమ్ సీన్ ఉంటుందని.. నా మునుపటి సినిమాల్లో ఇతర నటీమణులతో చేసినట్లే ఆమెను బెడ్‌రూమ్ లోకి తీసుకెళ్లాలని అనుకున్నాను.. ఎన్నో రేప్‌లు చేశాను. ఇలాంటి సన్నివేశాలు నాకు కొత్త కాదు. కానీ ఈ కుర్రాళ్ళు కాశ్మీర్‌లో షూటింగ్ సమయంలో సెట్స్‌లో కూడా త్రిషను నాకు చూపించలేదు` అని వ్యాఖ్యానించాడు.
మన్సూర్ అలీ ఖాన్ అవమానకరమైన అత్యాచార వ్యాఖ్యల కేసులో చెన్నై పోలీసుల సమన్లను తప్పించుకోవడాన్ని కూడా కోర్టు తప్పు పట్టింది. మన్సూర్ వ్యాఖ్య పెద్ద దుమారాన్ని రేపడంతో త్రిష అతడితో మళ్లీ స్క్రీన్‌ను పంచుకోనని పేర్కొంది. నీచంగా అసహ్యంగా మాట్లాడిన అతడితో నటించకపోవడం అదృష్టమని త్రిష వ్యాఖ్యానించింది. నా మిగిలిన సినిమా కెరీర్‌లో కూడా అలా జరగకుండా చూసుకుంటాను. అతనిలాంటి వ్యక్తులు మానవాళికి చెడ్డపేరు తెస్తారు! అని త్రిష తన ఎక్స్ ఖాతాలో రాసింది.
త్రిష కు మద్ధతుగా చిరంజీవి, నితిన్, చిన్మయి శ్రీపాద, ఖుష్బు సుందర్ సహా పలువురు టాలీవుడ్ పెద్దలు కూడా మన్సూర్ ని తప్పు పట్టారు. ఈ ఎదురుదెబ్బ తర్వాత మన్సూర్ అధికారికంగా త్రిషకు క్షమాపణలు చెప్పాడు. అయితే కొన్ని రోజుల తర్వాత అతను త్రిషపై పరువు నష్టం కేసు పెడతానని ప్రకటించాడు. మన్సూర్ అలీఖాన్ ఇంతకుముందు బ్లాక్ బస్టర్ మూవీ కెప్టెన్ ప్రభాకర్ చిత్రంలో తీవ్రవాది పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విలన్ గా, సహాయకపాత్రధారిగా నటిస్తున్నారు.